Australia beat South Africa: రెండు రోజుల్లోనే ఖేల్ ఖతమ్..!
ఆస్ట్రేలియా పిచ్ లు సహజంగానే పేసర్లకు అనుకూలిస్తాయి. ఇక గబ్బా లాంటి పిచ్ అయితే పేసర్లు నిప్పులు చెరుగుతారు. ఇలాంటి పిచ్ పై కాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేస్తే మ్యాచ్ ను గెలవొచ్చు. తాజాగా సౌతాఫ్రికా (Australia vs South Africa) కంటే బెటర్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా గబ్బాలో విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసిపోయింది.
- By Gopichand Published Date - 03:01 PM, Sun - 18 December 22

ఆస్ట్రేలియా పిచ్ లు సహజంగానే పేసర్లకు అనుకూలిస్తాయి. ఇక గబ్బా లాంటి పిచ్ అయితే పేసర్లు నిప్పులు చెరుగుతారు. ఇలాంటి పిచ్ పై కాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేస్తే మ్యాచ్ ను గెలవొచ్చు. తాజాగా సౌతాఫ్రికా (Australia vs South Africa) కంటే బెటర్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా గబ్బాలో విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసిపోయింది. పూర్తిగా బౌలర్లే ఆధిపత్యం కనబరిచిన ఆసీస్, సఫారీల తొలి టెస్టులో ఆతిథ్య జట్టు 6 వికెట్ల తేడాతో గెలిచింది. తొలిరోజే 15 వికెట్లు పడగా.. రెండోరోజు కూడా బౌలర్లు చెలరేగిపోయారు. 14 వికెట్లు తీశారు. 5 వికెట్లకు 145 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో రెండోరోజు ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా 218 పరుగులకు ఆలౌటైంది. ట్రావిడ్ హెడ్ 92 రన్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. సఫారీ బౌలర్లలో జెన్సన్ 3 , నోర్జే 2 వికెట్లు తీశారు.
తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా 99 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ పేసర్లు కమ్మిన్స్ , స్టార్క్ , బొలాండ్ నిప్పులు చెరగడంతో కోలుకోలేకపోయింది. ఆరంభం నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. జొండో 36, బవుమా 29 పరుగులు చేయకుంటే 60 పరుగుల లోపే ఆలౌటయ్యేది. తర్వాత 35 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ను సఫారీ పేసర్ రబాడ వణికించాడు. కేవలం 13 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. అయితే ఎక్స్ ట్రా రూపంలో 19 పరుగులు రావడంతో ఆసీస్ విజయం సాధించింది. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్ లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్ట్ బాక్సింగ్ డే డిసెంబర్ 26 నుంచి మెల్ బోర్న్ లో జరుగుతుంది.