R Ashwin: కోచ్ తప్పులు చేయమన్నాడు.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు
ఐపీఎల్ 2022 సీజన్ లో రవిచంద్రన్ అశ్విన్ ఆల్ రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్నాడు.
- Author : Naresh Kumar
Date : 27-05-2022 - 11:47 IST
Published By : Hashtagu Telugu Desk
ఐపీఎల్ 2022 సీజన్ లో రవిచంద్రన్ అశ్విన్ ఆల్ రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లోనూ సత్తాచాటాడు. ఈ సీజన్ 11 వికెట్లతో పాటు 185 పరుగులు చేసి ఆల్ రౌండ్ ప్రదర్శనతో మెప్పించాడు. ఇటీవల కాలంలో తన ఆటతీరులో కనిపిస్తున్న మార్పులపై రాజస్థాన్ రాయల్స్ యూబ్యూట్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాల్ని అశ్విన్ పంచుకున్నాడు.
2011 నుంచి 2013 మధ్యకాలంలో టీమ్ ఇండియాకు కోచ్‌గా వ్యవహరించిన డంకెన్ ఫ్లెచర్ ఇచ్చిన సలహా తన ఆటతీరుతో పాటు వ్యక్తిత్వాన్ని మార్చివేసిందని అశ్విన్ అన్నాడు. ఫ్లెచర్ కోచ్ గా పనిచేస్తున్న సమయంలో ఆటతీరును ఎలా మెరుగుపరుచుకోవాలని అతడిని సలహా అడిగాను. ఉన్నతమైన క్రికెటర్ గా మారాలంటే ఏం చేయాలో చెప్పమని కోరాను. అందుకు తప్పులు చేస్తూనే ఉండాలని ఫ్లెచర్ సలహా ఇచ్చాడు. నిన్ను ఆరాధించి, అభిమానించే వారి ముందు విఫలమవుతూ ఉండూ. నా జీవితం మొత్తం అలాగే గడిచింది అని ఫ్లెచర్ తనతో చెప్పాడని అశ్విన్ గుర్తు చేసుకున్నాడు.
ఆయన మాటలు తనను ఎంతో ప్రభావితం చేశాయని అశ్విన్ పేర్కొన్నాడు. తన జీవితంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని, తప్పుల్ని చేశానని, అవన్నీ ఆటగాడిగా తాను మరింత రాణించేలా దోహదపడ్డాయని, బౌలింగ్ లో మాత్రమే కాకుండా ఆల్ రౌండర్ గా తన పరిధులను విస్తరించుకునేలా ఉపయోగపడ్డాయని అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2022 సీజన్ లో అశ్విన్ రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ప్లేఆఫ్స్ కు చేరిన రాజస్థాన్ ఫైనల్ బెర్త్ కోసం రెండో క్వాలిఫయర్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.