Ambati Rayudu: ముంబై జట్టులో రాయుడు.. అందుకే పాలిటిక్స్ కి గుడ్ బై..!
రాజకీయాల నుంచి కొంత కాలం తప్పుకుంటున్నట్టు ప్రకటించిన క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు.
- By Naresh Kumar Published Date - 07:32 PM, Sun - 7 January 24

Ambati Rayudu: రాజకీయాల నుంచి కొంత కాలం తప్పుకుంటున్నట్టు ప్రకటించిన క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో జరగనున్న ఇంటర్నేషనల్ టీ ట్వంటీ లీగ్‌లో ముంబయి ఇండియన్స్ తరపున బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించాడు. దీని కోసమే రాజకీయాల నుంచి దూరమైనట్టు వెల్లడించాడు.ప్రొఫెషనల్ ఆటను ఆడే సమయంలో రాజకీయాల్లో ఉండకూడదని రాయుడు ట్వీట్ చేశాడు.ఐపీఎల్‌లో గత ఏడాది అంబటి రాయుడు చెన్నై సూపర్ కింగ్స్ తరపున ప్రాతినిథ్యం వహించాడు. లీగ్ జరుగుతున్న సమయంలోనే 2023 ఐపీఎల్ సీజనే తన చివరిదని ప్రకటించాడు. ఆ సీజన్‌లో ధోనీ సారథ్యంలో చెన్నై టైటిల్ సాధించింది. చెన్నై విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన రాయుడు ట్రోఫీ అందుకొని ఎమోషనల్ అయ్యాడు.
We’re now on WhatsApp. Click to Join.
అయితే ఈ సీజన్ ముగిసిన తర్వాత గుంటూరు జిల్లాలో విస్తృతంగా పర్యటించిన రాయుడు వైఎస్సార్‌సీపీలో అధికారికంగా చేరాడు. గుంటూరు జిల్లా నుంచి అసెంబ్లీ లేదా లోక్‌సభ స్థానానికి రాయుడు పోటీ చేసే అవకాశం ఉందని అంతా అనుకున్నారు. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఇంతలోనే రాయుడు యూటర్న్ తీసుకున్నాడు.టికెట్ విషయంపై వైఎస్సార్‌సీపీ నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతోనే రాయుడు తప్పుకున్నట్లు అర్థమవుతోంది. రాయుడు యూటర్న్ తీసుకోవడం ఇదే కొత్త కాదు. రిటైర్మెంట్ విషయంలోనూ ఇలానే తొందరపడి యూటర్న్ తీసుకున్నాడు.
ఇప్పుడు పాలిటిక్స్ ని పక్కన పెట్టి మళ్లీ గ్రౌండ్ లో అడుగుపెడుతున్నాడు. దుబాయ్ వేదికగా జరగనున్న ఇంటర్నేషనల్ టీ ట్వంటీ లీగ్ జనవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఆరు జట్లు తలపడే ఈ టోర్నీలో ముంబయి జట్టుకు నికోలస్ పూరన్ కెప్టెన్ గా వ్యవహారిస్తున్నాడు. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ తరపునే అరంగేట్రం చేసిన రాయుడు పదేళ్ల పాటు ఆ జట్టుకే ఆడాడు.