Ajinkya Rehane : నిర్ణయాలు నావి..క్రెడిట్ మరొకరికి
భారత క్రికెట్ జట్టులో అజంక్య రహానే వివాదాలకు దూరంగా ఉంటాడు. మీడియాతో మాట్లాడడం కూడా తక్కువే..
- By Naresh Kumar Published Date - 11:08 AM, Fri - 11 February 22

భారత క్రికెట్ జట్టులో అజంక్య రహానే వివాదాలకు దూరంగా ఉంటాడు. మీడియాతో మాట్లాడడం కూడా తక్కువే.. అలాంటి రహానే తాజాగా చేసిన వ్యాఖ్యలు భారత క్రికెట్ లో కలకలం రేపుతున్నాయి. మాజీ కోచ్ రవిశాస్త్రి టార్గెట్ గా రహానే కొన్ని హాట్ కామెంట్స్ చేశాడు. నేరుగా రవి శాస్త్రి పేరు ప్రస్తావించకుండా విమర్శలు గుప్పించాడు. ఆస్ట్రేలియాలో చారిత్రక సీరీస్ విజయం తర్వాత తన ఫామ్ పై వస్తున్న విమర్శలకు ధీటుగా జవాబిచ్చాడు. తాను చాలా విషయాలను తలచుకుని నవ్వుకుంటున్నానీ, క్రికెట్ తెలిసిన వారు ఇలా మాట్లాడరనీ కౌంటర్ ఇచ్చాడు. ఆస్ట్రేలియాలో ఏం జరిగిందో, అంతకు ముందు ఏం జరిగిందో అందరికీ తెలిసిందేననీ, . దీనిపై తానేమీ చెప్పనన్నాడు. క్రికెట్‌ను అర్థం చేసుకోని వారు మాత్రమే ఇలా మాట్లాడుతున్నారంటూ వ్యాఖ్యానించాడు.
తాను అక్కడ ఏం చేశానో తనకు తెలుసన్న రహానే ఆస్ట్రేలియా సిరీస్‌లో తాను తీసుకున్న కొన్ని నిర్ణయాలకు క్రెడిట్ మరొకరు తీసుకున్నారనీ అప్పటి కోచ్ రవి శాస్త్రిని ఉద్దేశించి మాట్లాడాడు.
నేనది చేశాను, నేనే ఆ నిర్ణయం తీసుకున్నాను, అది నిర్ణయం అంటూ కొందరు మాట్లాడారనీ చెప్పుకొచ్చాడు. వ్యూహాలపై జట్టు యాజమాన్యంతో చర్చ జరిగినా తాను నవ్వుకునే వాడిననీ గుర్తు చేసుకున్నాడు. చివరకి మైదానంలో తన పని తాను చేసుకునే వాడిననే చెప్పాడు. తన గురించి తాను ఎక్కువగా మాట్లాడుకోను, పొగిడేసుకోననీ రహానే స్పష్టం చేశాడు. నిజానికి, ఆ అద్భుతమైన విజయాల తర్వాత రవిశాస్త్రికి పేరొచ్చింది. మెల్ బోర్న్ లోనే కాకుండా మిగిలిన నాలుగు-మ్యాచ్‌ల సిరీస్‌లో కూడా అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో జట్టును నడిపించిన తీరుకు రహానే క్రికెట్ ప్రేమికుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. తాజాగా ఎవరి పేరును ప్రస్తావించకుండానే రహానే విమర్శలు గుప్పించాడు. అయితే రవిశాస్త్రిని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రహానే వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.