YS Jagan: రామాయపట్నం పోర్ట్ పనులకు జగన్ శంకుస్థాపన
రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించారు.
- Author : Balu J
Date : 20-07-2022 - 12:48 IST
Published By : Hashtagu Telugu Desk
రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ఈ మేరకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.40 గంటలకు రామాయపట్నం చేరుకున్నారు. 11 గంటలకు రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 3736.14 కోట్లతో ఓడరేవు మొదటి దశ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ మధ్యాహ్నం నెల్లూరు నుంచి అమరావతికి తిరుగు ప్రయాణమవుతారు. ఏపీ మారిటైమ్ బోర్డు ఆధ్వర్యంలో రామాయపట్నం పోర్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తుంది.
మొదటి దశలో మొత్తం నాలుగు బెర్త్‌లను నిర్మిస్తారు. ఈ పోర్టు ద్వారా ఏటా 25 మిలియన్ టన్నుల ఎగుమతులు జరుగుతాయి. కార్గో, బొగ్గు, కంటైనర్ల కోసం నాలుగు బెర్త్‌లను నిర్మిస్తారు. రెండో దశలో మొత్తం 15 బెర్త్‌లను నిర్మించడం ద్వారా 138.54 మిలియన్ టన్నులకు విస్తరించనున్నారు. ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, తెలంగాణలోని నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ సహా రాయలసీమలోని పలు జిల్లాలు పారిశ్రామిక, వాణిజ్య, రవాణా సేవలలో కీలకం కానున్న నేపథ్యంలో రామాయపట్నం పోర్టు రెండు తెలుగు రాష్ట్రాలకు కీలకం కానుంది.