Onion and Beauty: అందానికి, ఆరోగ్యానికి…ఉల్లిపాయ చేసే మేలేంటో తెలుసా..??
ముఖం, అందంగా, కాంతివంతంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యం చర్మం గురించి ఎక్కువ శ్రద్ద తీసుకుని సంరక్షణ చర్యలు తీసుకుంటారు.
- By Hashtag U Published Date - 01:10 PM, Wed - 20 April 22
ముఖం, అందంగా, కాంతివంతంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యం చర్మం గురించి ఎక్కువ శ్రద్ద తీసుకుని సంరక్షణ చర్యలు తీసుకుంటారు. కొంత మందికి ముఖంపై నల్లని మచ్చలు, మొటిమలు, మచ్చలు, పిగ్మెంటేషన్ వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అయితే ఇలాంటి సాధారణ చర్మ సమస్యల నివారణ కోసం అనేక రకాల రసాయన ఉత్పత్తులు వాడుతుంటారు. ఇవన్నీ కూడా మన చర్మానికి హాని కలిగిస్తాయి. ఇవన్నీ కాకుండా..మన వంటింట్లో ఉండే ఉల్లిపాయను ఉపయోగించి ముఖ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. ఇది మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. నిజమే ఉల్లిపాయతో ఎన్నో చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు.
ఉల్లిపాయవల్ల కలిగే ప్రయోజనాలు..
1. చర్మాన్ని ప్రకాశంతంగా చేయడంలో…
తాజాగా ఉల్లిపాయను ప్రతిరోజూ ముఖానికి అప్లై చేసినట్లయితే..నిర్జీవమైన చర్మాన్ని వదలించుకోవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మకణాలకు అందాన్నిస్తాయి. దీని ఫలితంగా చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది. నిజానికి ఉల్లిపాయలు తరచుగా ఉపయోగించినట్లయితే… మలినాలను దూరం చేసి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఉల్లిపాయ రసాన్ని ముఖానికి అప్లై చేసినట్లయితే…ఆరోగ్యకరమైన మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.
2. మచ్చలు, పిగ్మెంటేషన్ తొలగించడంలో..
ఉల్లిపాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది డార్క్ స్పాట్స్ అగ్లీ ప్యాచెస్, పిగ్మెంటేషన్ మార్క్స్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక టేబుల్ స్పూన్ తాజా ఉల్లిపాయ రసంలో చిటికెడు పసుపు కలిసి ప్రతిరోజూ దాన్ని ముఖంపై మసాజ్ చేయండి. ఇదే కాకుండా ఉల్లిపాయ రసంలో శనగపిండి, అర టీస్పూప్ మిల్క్ క్రీమ్ కలిపి కూడా ముఖంపై అప్లై చేయవచ్చు. ఇది చర్మాన్ని ప్రకాశింపజేయడంలో చక్కని ప్యాక్ వలే పనిచేస్తుంది.
3. వృద్ధాప్యం సంకేతాలు కనిపించకుండా…
ముఖంపై ఉల్లిపాయతో మసాజ్ చేసినట్లయితే…చర్మ కణాల ద్వారా రక్త ప్రసరణ పెంచుతుంది. ఇలా చేస్తే దృఢమైన, యవ్వనమైన చర్మం మీ సొంతం అవుతుంది. ఉల్లిపాయలో విటమిన్లు ఎ, సి, ఇలతోపాటు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కఠినమైన యూవీ కిరణాల వల్ల కలిగే అకాల వృద్ధాప్య సంకేతాలను ఎదుర్కొనేందుకు సహాయపడతాయి. తాజా ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి…ఉల్లిపాయ రసంలో కాటన్ బాట్ ను ముంచి చర్మంపై అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే చర్మంపై ముడతలు తగ్గుతాయి.
4. మొటిమలు నివారించడంలో….
ముఖంపై మొటిమలు చాలా మంది ఎదుర్కొనే సమస్య. ముఖంపై తాజా ఉల్లిపాయ రసంతో మసాజ్ చేయాలి. మొటిమలు కలిగించే బ్యాక్టీరియాను నిరోధించడానికి శనగపిండితో ఉల్లిపాయ ఫేస్ ప్యాక్ ను రెడీ చేసుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ ఉల్లిపాయ రసం తీసుకుని దానికి ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ లేదా బాదం నూనెను కలపాలి. బాగా కలిపిన తర్వాత ముఖంపై అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
5. జుట్టు పెరుగుదలకు…
ఉల్లిపాయ రసం మీ జుట్టుకు మేలు చేస్తుంది. ఉల్లిపాయలో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. దీనికి తలకు పట్టించడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. తద్వారా వెంట్రుకల కుదుళ్లను తిరిగి పెంచడంలో సహాయపడుతుంది. ఉల్లిపాయ రసాన్ని తలకు మసాజ్ చేస్తే…జుట్టు పెరుగుతుంది. ఉల్లిపాయరసం, రోజ్ వాటర్ సమానంగా తీసుకుని జుట్టుకు స్ప్రే చేసి అర్థగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది.
6. చుండ్రుతో పోరాడుతుంది….
చండ్రు సమస్యలతో బాధపడేవారికి..ఉల్లిపాయరసం మంచిగా పనిచేస్తుంది. పచ్చి ఉల్లిపాయ రసాన్ని తలకు అప్లై చేసి షాంపూతో కడిగేయాలి. ఉల్లిపాయలో కొంచెం నిమ్మరసం, పెరుగును కలిపి పేస్టుల తయారు చేసి …తలకు అప్లై చేయాలి. 20నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.