5 States – Number Game : ఐదు రాష్ట్రాల పొలిటికల్ పంచాంగం.. నంబర్ గేమ్ లో నెగ్గేదెవరు ?
5 States - Number Game : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ పోల్స్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల నగారాను కేంద్ర ఎన్నికల సంఘం మోగించింది.
- By Pasha Published Date - 12:45 PM, Mon - 9 October 23

5 States – Number Game : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ పోల్స్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల నగారాను కేంద్ర ఎన్నికల సంఘం మోగించింది. ఈ తరుణంలో ఆ 5 రాష్ట్రాలలో వివిధ రాజకీయ పార్టీల బలాబలాలు ఏమిటి ? ప్రస్తుతం ఏ పార్టీకి ఎంత బలం ఉంది ? అక్కడున్న రాజకీయ పరిస్థితులు ఏమిటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
తెలంగాణ
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. 2018లో జరిగిన అసెంబ్లీ పోల్స్ లో బీఆర్ఎస్ కు 88, కాంగ్రెస్ కు 19, మజ్లిస్ కు 7, టీడీపీకి 2, బీజేపీకి 1, ఏఐఎఫ్బీకి 1, స్వతంత్ర అభ్యర్థికి 1 సీటు వచ్చాయి. తెలంగాణ అసెంబ్లీ గడువు డిసెంబర్ 13తో ముగియనుంది. తెలంగాణలో హోరాహోరీ పోరు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే ఉంది. బీజేపీ మూడో స్థానంలో నిలవొచ్చు. కీలక నేతల చేరికతో కాంగ్రెస్ స్వింగ్ లో ఉంది. ముఖ్య నేతల వలసతో బీఆర్ఎస్ కాస్త డీలా పడింది. బండి సంజయ్ ను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాత తెలంగాణలో బీజేపీ యాక్టివిటీ తగ్గిపోయింది. ఎంతోమంది ఆ పార్టీ ముఖ్య నేతలు ఇప్పుడు పక్కచూపులు చూస్తున్నారు.కాకపోతే.. సీఎం అభ్యర్థి లేకపోవడం అనేది కాంగ్రెస్, బీజేపీలకు పూడ్చలేని లోటు!!
మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. 2018లో కాంగ్రెస్ కు 114, బీజేపీకి 109, బీఎస్పీకి 2, ఎస్పీకి 1, స్వతంత్రులకు 4 సీట్లు వచ్చాయి. ఈ రాష్ట్ర అసెంబ్లీ గడువు డిసెంబరు 17తో ముగియనుంది. ఈ రాష్ట్రంలో గత ఎన్నికల్లో బీజేపీ కంటే కాంగ్రెసే ఎక్కువ సీట్లు సాధించింది. ఇప్పుడు కూడా దాదాపు అదే పరిస్థితి ఉంది. మైనార్టీలు, దళితులపై జరిగిన మూకదాడులతో బీజేపీకి దళిత, మైనార్టీ ఓటు బ్యాంకు దూరంగా ఉంది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఇంకా అసెంబ్లీ టికెట్ కన్ఫార్మ్ కాలేదు. దీంతో అక్కడ బీజేపీకి ఇప్పుడు నాయకత్వ లోటు ఉంది. ఇది బీజేపీకి మైనస్ కాబోతోంది. కర్ణాటక తరహాలో మధ్యప్రదేశ్ లో కూడా వన్ మ్యాన్ షో చేయాలని ప్రధాని మోడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే.. కర్ణాటక ఫలితం మధ్యప్రదేశ్ లో రిపీట్ అవుతుంది. ఉమాభారతి లాంటి సీనియర్ నేతలను పట్టించుకోకపోవడం బీజేపీకి మరో పెద్ద ప్రతికూల అంశం. కమల్ నాథ్, దిగ్విజయ్ సింగ్ లాంటి నేతలు ఉండటం కాంగ్రెస్ కు ప్లస్ పాయింట్.
We’re now on WhatsApp. Click to Join
రాజస్థాన్
రాజస్థాన్ రాష్ట్రంలో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ కు 100 సీట్లు, బీజేపీకి 73 సీట్లు, ఇతరులకు 13 సీట్లు, బీఎస్పీకి 6 సీట్లు, ఆర్ఎల్పీకి 3 సీట్లు, సీపీఎంకి 2 సీట్లు, బీటీపీకి 2 సీట్లు, ఆర్ఎల్డీకి 1 సీటు వచ్చాయి. ఆ రాష్ట్ర అసెంబ్లీ గడువు డిసెంబర్ 17న ముగియనుంది. రాజస్థాన్ లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగనుంది. ఇన్నాళ్లూ సచిన్ పైలట్, అశోక్ గెహ్లాట్ మధ్య సాగిన కోల్డ్ వార్ కాంగ్రెస్ కు మైనస్ పాయింట్ కానుంది. మళ్లీ గెలవడానికే వీరిద్దరి కలిశారనే సంకేతం జనంలోకి వెళ్లడం కాంగ్రెస్ కు ప్రతికూలంగా మారనుంది. కేంద్ర సర్కారు సంక్షేమ పథకాలు బీజేపీకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. మణిపూర్ వ్యవహారంతో రాజస్థాన్ లో బీజేపీకి మహిళా ఓటుబ్యాంకు దూరమయ్యే సూచనలు ఉన్నాయి. ఓవరాల్ గా కాంగ్రెస్ కే వెయిటేజీ ఎక్కువ ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
ఛత్తీస్‌గఢ్
ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కు 68 సీట్లు, బీజేపీకి 15 సీట్లు, జేసీసీకి 5 సీట్లు, బీఎస్పీకి 2 సీట్లు వచ్చాయి. ఈ రాష్ట్ర అసెంబ్లీ గడువు డిసెంబర్ 17తో ముగియనుంది. ఛత్తీస్ గఢ్ లోనూ బీజేపీకి సీఎం క్యాండిడేట్ ను ప్రకటించలేదు. ఇది ఆ పార్టీకి మైనస్ పాయింట్ గా మారనుంది. కేవలం కేంద్ర సర్కారు సంక్షేమ పథకాలను నమ్ముకొని బీజేపీ ఎన్నికల క్షేత్రానికి వెళ్తోంది. కాంగ్రెస్ సర్కారు కులగణన అంశం, ఉచిత హామీలు, మైనారిటీ సంక్షేమం అనే అంశాలను నమ్ముకుంది. హస్తం పార్టీ గెలిచాకే రాష్ట్రంలో నక్సల్స్ సమస్య సమసిపోయిందనే విషయాన్ని కాంగ్రెస్ సర్కారు జనంలోకి తీసుకెళ్తోంది. ఈ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తుందనే అంచనాలు వెలువడుతున్నప్పటికీ.. కాంగ్రెస్ కే వెయిటేజీ ఎక్కువగా ఉన్నట్లు (5 States – Number Game) తెలుస్తోంది.
మిజోరం
మిజోరం రాష్ట్రంలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) అధికారంలో ఉంది. 2018లో ఇక్కడ ఎంఎన్ఎఫ్ కు 26 సీట్లు, కాంగ్రెస్ కు 5 సీట్లు, జోరమ్ పీపుల్స్ మూమెంట్ పార్టీకి 8 సీట్లు, బీజేపీకి 1 సీటు వచ్చాయి. ఈ రాష్ట్ర అసెంబ్లీ గడువు డిసెంబర్ 15తో ముగియనుంది. మిజోరంలో ప్రాంతీయ పార్టీల హవా ఎక్కువ. మణిపూర్ హింసాకాండ ప్రభావం ఇక్కడి ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించబోతోంది. ప్రత్యేకించి మహిళా ఓటు బ్యాంకు బీజేపీకి దూరం పాటించే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో బీజేపీకి ఉన్న 1 సీటు కూడా గల్లంతైనా ఆశ్చర్యం లేదు. ఎంఎన్ఎఫ్, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడే అవకాశం ఉంది.