Special Status: ప్రత్యేక రగడ.. జీవీఎల్‌కు కౌంటర్ ఇచ్చిన విజయసాయిరెడ్డి
- Author : HashtagU Desk
Date : 15-02-2022 - 10:17 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ ప్రత్యేక హోదా అంశం తొలగించడంపై వైసీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ నెల 17న జరిగే తెలుగు రాష్ట్రాల భేటీ అజెండాలో కేంద్ర హోంశాఖ మార్పులు చేసిన సంగతి తెలిసిందే. తొలుత ఎజెండాలో ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చిన కేంద్రం తర్వాత పొరపాటు అంటూ ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించింది. ఈ క్రమంలో వెంటనే అజెండాలో మార్పు చేస్తూ మరో సర్క్యులర్ జారి చేసింది కేంద్ర హోంశాఖ.
త్రిసభ్య కమిటీ భేటీ అజెండాలో ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించిన నేపధ్యంలో, బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ ఏపీ అభివృద్ధి పై అధికార వైసీపీకి చిత్రశుద్ధి లేదని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల పై తాజాగా వైసీీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందింస్తూ.. జీవీఎల్‌కు కౌంటర్ ఇచ్చారు. అయ్యా అబద్దాల నరసింహా 2019 ఎన్నికల్లో మేము 22 మంది లోక్ సభ సభ్యుల్ని గెలిపించుకోవడం వల్ల మీరు ఏపీకి న్యాయం చేయడం లేదా.. లేక గత ఎన్నికల్లో మీ పార్టీకి 301 సీట్లు రావడం వల్ల మాకు న్యాయం చేయడం లేదా అని ప్రశ్నించారు. అసలు మీరు రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలన్నారు. ఇక బీజేపీ నేతలు అబద్ధాలు చెప్పడం మానుకుంటే మంచిదని విజయసాయిరెడ్డి హితవు పలికారు.