Armed Drones : ఇండియాకు 30 సాయుధ డ్రోన్లు.. 24వేల కోట్ల డీల్ ?
Armed Drones : సాయుధ డ్రోన్లను అమెరికా నుంచి కొనేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా ఉన్నాయి.
- Author : Pasha
Date : 14-06-2023 - 5:18 IST
Published By : Hashtagu Telugu Desk
Armed Drones : సాయుధ డ్రోన్లను అమెరికా నుంచి కొనేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా ఉన్నాయి. దాదాపు 30కిపైగా MQ-9B సీగార్డియన్ డ్రోన్లను భారత్ కు విక్రయించేందుకు అమెరికా సిద్ధమైనట్టు తెలుస్తోంది. అయితే భారత్ ఎన్ని డ్రోన్ల కొనుగోలుకు ఆర్డర్ ఇవ్వనుంది అనే దానిపై క్లారిటీ రాలేదు. జూన్ 22న అమెరికా పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భేటీ కానున్నారు. ఈ మీటింగ్ లో సీగార్డియన్ డ్రోన్ల (Armed Drones) డీల్ పై చర్చ జరుగుతుందని తెలుస్తోంది. వీటికి సంబంధించిన డీల్ విలువ దాదాపు రూ.24వేల కోట్లు(3 బిలియన్ డాలర్ల) దాకా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Also read : Drones : వచ్చే వారం నుంచి ప్యాసింజర్ డ్రోన్స్ పరీక్షలు!
MQ-9B సీగార్డియన్ అనేది శాటిలైట్ డ్రోన్. ఇది అన్ని వాతావరణాలలోనూ 30 గంటలకుపైగా పరిసరాలను నిరంతరాయంగా పర్యవేక్షించగలదు. ఇది సులువుగా, సురక్షితంగా పౌర గగనతలంలోకి వెళ్లి కలిసిపోతుంది. నౌకాదళ ప్రాంతాలను పర్యవేక్షించగలదు. దౌత్యపరమైన కారణాలతో ఇన్నాళ్ళుగా సీగార్డియన్ డ్రోన్లకు సంబంధించిన డీల్ దిశగా అడుగులు పడలేదు. ఇప్పటివరకు ఇంటెలిజెన్స్ సమాచార సేకరణ ఆపరేషన్‌ల కోసం భారతదేశం ఈ డ్రోన్లను అమెరికా నుంచి లీజుకు తీసుకొని వాడుకుంటోంది.