Ukraine War : దేశంలో ఉక్రెయిన్ తుఫాన్.. విద్యార్థుల తరలింపు విషయంలో వార్
ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా వైద్య విద్యార్థులు చిక్కుకోవడంతో ఆందరిలో ఆందోళన నెలకొంది.
- By Hashtag U Published Date - 11:59 AM, Thu - 3 March 22

ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా వైద్య విద్యార్థులు చిక్కుకోవడంతో ఆందరిలో ఆందోళన నెలకొంది. వారిని సురక్షితంగా తీసుకురావడమే తక్షణ కర్తవ్యంగా మారింది. విద్యార్థులను ఆయా దేశాలు బందీలుగా చేసుకుంటున్నాయన్న వార్తలు వస్తున్నాయి. ఇలాంటి విపత్కర సమయాల్లో దేశంలో అనవసర చర్చ జరుగుతుండడంపై విమర్శలు వస్తున్నాయి.
గ్రౌండ్ రియాల్టీస్‌ను పట్టించుకోకుండా ఏవేవో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో విద్యార్థులదే తప్పు అన్నట్టుగా కొందరు మాట్లాడారు. పరిస్థుతులను గమనించి ముందుగా వచ్చి ఉంటే ఇంత ఇబ్బంది ఉండేది కాదు కదా అని కొందరు అన్నారు. క్లాసులకు తప్పకుండా రావాలని, ఆన్‌లైన్ ఫెసిలిటీ ఉండదని యూనివర్సిటీలు చెప్పాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే వారు అక్కడ ఉండిపోవాల్సి వచ్చిందన్న సమాధానాలు వచ్చాయి.
విద్యార్థులను తిరిగి తీసుకురావడం అన్నదాని కన్నా తప్పు ఎవరిది అన్న విషయంలో బ్లేమ్ గేమ్ నడుస్తుండడంపై చాలా మంది ఆగ్రహంతో ఉన్నారు. అందుకు ఇది టైమా? అని ప్రశ్నిస్తున్నారు. యుద్ధాలు జరిగేటప్పుడు ఆన్ ది స్పాట్ డెసిషన్లు ఉంటాయని, తొలుత అనుకున్నవన్నీ జరగవని అంటున్నారు. ఈ సమయంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చేసిన వ్యాఖ్యపై మరిన్ని విమర్శలు వస్తున్నాయి.
నీట్‌లో పాసు కాని వారే ఆ దేశాలకు చదువులకు వెళ్తున్నారని అన్నారు. అక్కడ చదువులు ముగించుకొని వచ్చినా, ఇక్కడ జరిగే అర్హత పరీక్షలో పాసు కావడం లేదని చెప్పారు. దీనిని చాలా మంది తల్లిదండ్రులు, వైద్యులు ఖండిస్తున్నారు. ఖర్చులు తట్టుకోలేకే అంత దూరం వెళ్తున్నారని అంటున్నారు. దేశంలో ఎంబీబీఎస్‌కు రూ.కోటి ఖర్చవుతుందని, అక్కడికి వెళ్తే ఇందులో మూడో వంతులో పూర్తవుతుందని చెబుతున్నారు.
చదువులు ముగించికొని వచ్చిన అనంతరం అర్హత కోసం నిర్వహించే ఎఫ్ఎంజీఏ పరీక్ష పైనా విమర్శలు ఉన్నాయి. ఎక్కడైనా ఏ పరీక్షకైనా మోడల్ పేపర్లు , వచ్చిన మార్కులు ఇవ్వడం ఆనవాయితీ అని, దీనికి మాత్రం అలాంటివి ఉండవని అంటున్నారు. ఇవేవీ లేకుండా పాసు కావడం లేదని విమర్శించడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు.