Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊహించని షాక్? మరో కేసు నమోదు…
వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు. అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని వంశీపై కేసు నమోదు చేసిన మైనింగ్ శాఖ, 100 కోట్ల పైన అక్రమాలకు పాల్పడ్డారని గన్నవరం పోలీస్ స్టేషన్ లో మైనింగ్ ఏడీ ఫిర్యాదు చేసారు.
- By Kode Mohan Sai Published Date - 12:53 PM, Fri - 16 May 25

Vallabhaneni Vamsi: వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కొత్త కేసు నమోదైంది. గన్నవరం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరిపినట్టు ఆరోపణలపై ఆయనపై ఈ కేసు నమోదు చేశారు. మైనింగ్ శాఖ ఏడి గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అక్రమ తవ్వకాలపై సేకరించిన ఆధారాలతో కూడిన నివేదికను పోలీసులకు అందించారు.
ఈ నివేదిక ప్రకారం, 2019 నుంచి 2024 మధ్యకాలంలో వంశీ మరియు ఆయన అనుచరులు భారీగా అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని తెలిపారు. ఈ అక్రమాల విలువ రూ.100 కోట్లకు పైగానే ఉంటుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదు ఆధారంగా గన్నవరం పోలీసులు వంశీ సహా మొత్తం 8 మందిపై కేసు నమోదు చేశారు.
ఇప్పటికే వల్లభనేని వంశీ గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ రోజు ఆయన బెయిల్ పిటిషన్‌పై విజయవాడ కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఈ కేసులో బెయిల్ లభించినా, నకిలీ ఇళ్ల పట్టాల కేసులో నూజివీడు మేజిస్ట్రేట్ కోర్టు రిమాండ్ విధిస్తే వంశీకి మళ్లీ జైలు తప్పదని తెలుస్తోంది.
ఇలా వరుసగా మూడవ కేసుగా, అక్రమ మైనింగ్ కేసు కూడా వంశీపై నమోదవడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆయనపై ఉన్న కేసులు:
-
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు
-
నకిలీ ఇళ్ల పట్టాల కేసు
-
తాజా అక్రమ మైనింగ్ కేసు