Two Strong Earthquakes: అరుణాచల్ ప్రదేశ్‌లో మరోసారి భూకంపం.!
వరుస భూకంపాలతో అరుణాచల్ ప్రదేశ్ వణికిపోతోంది.
- By Gopichand Published Date - 12:18 PM, Thu - 10 November 22

వరుస భూకంపాలతో అరుణాచల్ ప్రదేశ్ వణికిపోతోంది. గురువారం ఉదయం 11 గంటలకు మరోసారి భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.5గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. సియాంగ్ సమీపంలో భూ ఉపరితలానికి 10 కి.మీ లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు వెల్లడించింది. గురువారం అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ సియాంగ్‌లో 5.7, 3.5 తీవ్రతతో భూకంపాలు సంభవించాయి. 5.7 తీవ్రతతో మొదటి భూకంపం ఉదయం 10.31 గంటలకు సంభవించగా, మరొకటి ఉదయం 10.59 గంటల వద్ద సంభవించింది.
“భూకంపం భూ ఉపరితలానికి 10 కి.మీ లోతులో సంభవించిందని” అని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఈ భూకంపం వలన ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, భారతదేశ రాజధాని చుట్టుపక్కల నగరాల్లో 5.6 తీవ్రతతో బుధవారం భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం కూడా భూకంపం సంభవించింది.