Realtors: భూవివాదం.. ఇద్దరు రియల్టర్లు మృతి!
హైదరాబాద్ శివార్లలోని ఇబ్రహీంపట్నం సమీపంలో మంగళవారం గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో ఇద్దరు రియల్టర్లు మృతి చెందారు.
- By Balu J Published Date - 05:46 PM, Tue - 1 March 22

హైదరాబాద్ శివార్లలోని ఇబ్రహీంపట్నం సమీపంలో మంగళవారం గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో ఇద్దరు రియల్టర్లు మృతి చెందారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రంగారెడ్డి జిల్లా కర్ణంగూడ గ్రామంలో ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వీరిద్దరూ కొనుగోలు చేసిన 20 ఎకరాల భూమికి సంబంధించిన వివాదమే హత్యకు దారితీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రీనివాస్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన రాఘవేంద్రరెడ్డి వనస్థలిపురంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ను సందర్శించి హైదరాబాద్‌కు తిరిగి వస్తున్నట్లు రియల్టర్ల బంధువులు తెలిపారు. రోడ్డు పక్కన గాయపడిన వ్యక్తితో స్కార్పియో వాహనాన్ని కొందరు చూడడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మొదట ఇది ప్రమాదవశాత్తు జరిగినట్లు అనుమానించారు. కాని గాయపడిన వ్యక్తి తనపై ఎవరో కాల్పులు జరిపారని చెప్పారు. సమీపంలో మృతదేహాన్ని కూడా గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. శ్రీనివాస్ రెడ్డిపై పాయింట్ బ్లాంక్ నుంచి ఎవరో కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు భావిస్తున్నారు. అతని భాగస్వామి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు, కానీ దుండగులు వెంబడించి కాల్చి చంపారు. రెండేళ్ల క్రితం 20 ఎకరాల భూమిని కొనుగోలు చేశామని, అయితే పొరుగువారితో కొంత వివాదం ఉందని మృతుడి కుటుంబీకులు తెలిపారు. పోలీసులు అతడిని విచారించారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ఘటనాస్థలికి చేరుకున్నారు.