Rains Alert: మరో రెండ్రోజులు వర్షాలు. తెలుగు రాష్ట్రాల్లో రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
మండే ఎండలు ఓ వైపు...మరోవైపు భారీ వర్షాలు (Rains Alert) . తెలుగు రాష్ట్రాల్లో ఇదీ పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.
- By hashtagu Published Date - 07:36 AM, Mon - 27 March 23

మండే ఎండలు ఓ వైపు…మరోవైపు భారీ వర్షాలు (Rains Alert) . తెలుగు రాష్ట్రాల్లో ఇదీ పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఉపరితల ధ్రోణి ప్రభావంతో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురస్తుండగా…మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరిక జారీ చేసింది. ఈ జిల్లాల్లోని రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాలతోపాటు ఇరు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలీమీటర్ల మేర వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది.
అటు ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణశాఖ తెలిపింది. ఉత్తరకోస్తా, రాయలసీమలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. కర్నూలు, నంద్యాల జిల్లాలో వర్షాలు పడే అవకాశం లేదని..మిగిలిన ప్రాంతాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. వర్షాలు పడుతున్న సమయంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు. అకాల వర్షాలతో నిండిమునిగిన రైతులకు మళ్లీ ఈ వర్షాలు దెబ్బమీద దెబ్బ కొట్టేలా ఉన్నాయి.