Pawan Kalyan: అంగన్వాడీల హామీలు నెరవేర్చమంటే వేధిస్తారా? వైసీపీపై పవన్ ఫైర్
అంగన్ వాడీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.
- By Balu J Published Date - 04:25 PM, Fri - 15 December 23

Pawan Kalyan: రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు పొరుగు రాష్ట్రాల కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తానని ప్రతిపక్ష నేతగా హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక వెయ్యి రూపాయలు తక్కువ వేతనాలు ఇవ్వడాన్ని ఏమనాలి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అంగన్ వాడీలు తమ సమస్యలను పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేస్తుంటే వేధింపులకు గురి చేయడం పాలకుల నైజాన్ని తెలియచేస్తోందని ఆయన మండిపడ్డారు.
అంగన్వాడీల కేంద్రాల తాళాలు బద్దలుకొట్టి పంచనామాలు చేస్తామని చిరుద్యోగులను బెదిరిస్తున్నారని, రాష్ట్రంలో ఉన్న 52 వేల అంగన్వాడీ కేంద్రాల్లో లక్ష మందికిపైగా మహిళలు కార్యకర్తలుగా, హెల్పర్లుగా నామ మాత్రపు వేతనాలకే పని చేస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలని, అదే విధంగా సుప్రీం కోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ విధానాన్ని వీరికి వర్తింప చేయాలని హెచ్చరించారు. చిరుద్యోగుల ఆర్థిక ఇబ్బందులపై మానవతా దృక్పథంతో స్పందించాలని, అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు చేస్తున్న నిరసన కార్యక్రమాలకు జనసేన పార్టీ మద్దతు ప్రకటిస్తుందని పవన్ తేల్చి చెప్పారు. వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Also Read: Hyderabad: హైదరాబాద్ పై చలి పంజా, వణుకుతున్న సిటీ జనం!