TDP: సహజ మరణాలన్నీ.. సారా మరణాలే..!
- Author : HashtagU Desk
Date : 22-03-2022 - 10:23 IST
Published By : Hashtagu Telugu Desk
నేటి ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే సభ ప్రారంభమయిన వెంటనే టీడీపీ సభ్యులు మరోసారి ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో నాటుసారా జంగారెడ్డిగూడెం మృతులపై జ్యుడిషియల్ విచారణ జరపాలని టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. అంతే కాకుండా నాటుసారా మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికి 25 లక్షల పరిహారాన్ని చెల్లించాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారాం అసహనం వ్యక్తం చేశారు.
ఇకపోతే అంతకు ముందు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేతృత్వంలో తెలుగుదేశంపార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన ర్యాలీని చేపట్టారు. రాష్ట్రంలో జరుగుతున్న సహజమరణాలన్నీ, సారామరణాలే అంటూ పెద్దె ఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్రంలో కల్తీసారా, ముఖ్యంగా జే బ్రాండ్ మద్యం కారణంగా అనేక మంది చనిపోతున్నారని, కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తోందని, సామాన్యుల ప్రాణాలు పోతున్నా, జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు నినాదాలు చేశారు. ఈ క్రమంలో సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి శాసనసభ వరకు టీడీపీ నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు.