Andhra Pradesh: రాధకి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత- చంద్రబాబు
- By hashtagu Published Date - 10:55 AM, Wed - 29 December 21

వంగవీటి రాధ హత్యకు జరిగిన రెక్కీపై సమగ్ర విచారణ జరిపించాలని ఏపీ డీజీపీకి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రాధకి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితి భయంకరంగా ఉందని బెదిరింపులు, గూండారాజ్ పరంపరలో భాగంగా టీడిపి నేత వంగవీటి రాధాను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. ఇలాంటి చట్టవ్యతిరేక చర్యలు గుండాల రాజ్యాన్ని తలపిస్తున్నాయని చంద్రబాబు అన్నారు. హింసాత్మక ఘటనలపై తీవ్రమైన చర్యలు లేకపోవడం వల్లే ఈ తరహా సంఘటనలు పదే పదే పునరావృతమవుతున్నాయని మండిపడ్డారు. నేరస్థులపై సమగ్ర విచారణ తర్వాత కఠినమైన చర్యలు చేపట్టడం వల్లనే రాష్ట్రంలో ప్రాథమిక హక్కులను కాపాడగలం అని స్పష్టం చేశారు.
వంగవీటి రాధకు చంద్రబాబు ఫోన్ చేసి రెక్కీ నిర్వహించిన వ్యవహారంపై ఆరా తీశారు. గన్‌మెన్లను తిరస్కరించడం సరికాదని.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భద్రత విషయంలో అశ్రద్ధ వద్దని హెచ్చరించారు. రాధకు పార్టీ పూర్తి అండగా నిలుస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.