Temple Sealed : ఆలయానికి సీల్ వేసిన అధికారులు.. ఎందుకంటే ?
Temple Sealed : తమిళనాడులోని విల్లుపురం జిల్లా మెల్పాడి సమీపంలోని ద్రౌపది అమ్మన్ ఆలయాన్ని అధికారులు బుధవారం సీల్ వేశారు. దళితులకు ఆలయ ప్రవేశం కల్పించేది లేదని ఓ అగ్రవర్ణానికి చెందిన పలువురు ఈ ఏడాది ఏప్రిల్‌లో చేసిన ప్రకటనతో మొదలైన వివాదం ఇంకా కొనసాగుతోంది.
- By Pasha Published Date - 12:39 PM, Wed - 7 June 23

Temple Sealed : తమిళనాడులోని విల్లుపురం జిల్లా మెల్పాడి సమీపంలోని ద్రౌపది అమ్మన్ ఆలయాన్ని అధికారులు బుధవారం సీల్ వేశారు. దళితులకు ఆలయ ప్రవేశం కల్పించేది లేదని ఓ అగ్రవర్ణానికి చెందిన పలువురు ఈ ఏడాది ఏప్రిల్‌లో చేసిన ప్రకటనతో మొదలైన వివాదం ఇంకా కొనసాగుతోంది. అప్పటి నుంచి రెండు వర్గాల మధ్య పలుమార్లు ఘర్షణ జరిగింది. స్థానిక పోలీస్ స్టేషన్ లో నాలుగు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. తాజాగా మరోసారి కూడా స్థానికంగా ఆలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా దేవాదాయ శాఖకు చెందిన అధికారులు ద్రౌపది అమ్మన్ ఆలయానికి బుధవారం సీల్(Temple Sealed) వేశారు. మరోవైపు రెండు వర్గాల మధ్య సయోధ్యను కుదిర్చే చర్చలు కూడా నిర్వహిస్తున్నారు.
Also read : Bells: ఆలయంలో ఆరు రకాల గంటలు ఎందుకు కొడతారు.. ఎప్పుడు కొడతారో తెలుసా?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్‌లో దళిత వర్గానికి చెందిన ఒక వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించాడు. అతడి ఆలయ ప్రవేశంపై ఓ అగ్రవర్ణానికి చెందిన పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం దళితులను ఆలయంలోకి రానీయకుండా బ్యాన్ విధిస్తూ ప్రకటన చేశారు. ఈ పరిణామాలే స్థానికంగా ఉద్రిక్తతలకు దారితీశాయి. కాగా, కుల మతాలకు అతీతంగా భక్తులందరినీ ఆలయంలోకి అనుమతించాలంటూ విల్లుపురం ఎంపీ డి.రవికుమార్, ఇతర పార్టీల నేతలంతా కలిసి జిల్లా కలెక్టర్ సి.పళనికి వినతి పత్రం సమర్పించారు.