Tabassum Death: ప్రముఖ బాలీవుడ్ నటి మృతి.!
ప్రముఖ బాలీవుడ్ నటి తబస్సుమ్ గోవిల్ గుండెపోటుతో మృతి చెందారు.
- Author : Gopichand
Date : 19-11-2022 - 7:41 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రముఖ బాలీవుడ్ నటి తబస్సుమ్ గోవిల్ గుండెపోటుతో మృతి చెందారు. మహారాష్ట్ర ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు. 78 ఏళ్ల తబస్సుమ్ ఆరోగ్యకరంగానే ఉన్నారు. 10 రోజుల క్రితం ఒక షో షూటింగ్‌లోనూ పాల్గొన్నారు. ఉన్నట్టుడి గుండెపోటుతో రావడంతో నిన్న ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలనటిగా ఆమె 1947లో సినీ జీవితం ప్రారంభించారు. ఎన్నో చిత్రాల్లో నటించారు. దూరదర్శన్ సెలబ్రిటీ టాక్ షోకు హోస్ట్‌గా వ్యవహారించారు.
తబస్సుమ్ 1947 సంవత్సరంలో ‘మేరా సుహాగ్’ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత ఆమె అనేక సినిమాలు, టీవీ షోలలో భాగమైంది. అయితే 78 ఏళ్ల వయసులో ఈ సుప్రసిద్ధ నటి ఈ లోకానికి వీడ్కోలు పలికింది. తబస్సుమ్‌కి నిన్న అంటే శుక్రవారం రాత్రి రెండుసార్లు గుండెపోటు వచ్చింది. ఆమెకి ఉదయం 8:40 గంటలకు మొదటి గుండెపోటు వచ్చింది. 8:42 గంటలకు రెండవసారి గుండెపోటు రావడంతో ఆమె మరణించారు. శనివారం ఆమె అంత్యక్రియలు ముంబైలో జరిగాయి. ఆమె కుమారుడు హోషాంగ్ గోవిల్ మాట్లాడుతూ.. ఆమెను ఖననం చేసే ముందు ఆమె మరణం గురించి ఎవరికీ చెప్పకూడదని తన తల్లి కోరిక అని చెప్పాడు.
చిన్నతనంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పనిచేసిన తబస్సుమ్ నటిగానే కాకుండా టాక్ షో హోస్ట్‌గా కూడా తనదైన ముద్ర వేసింది. దూరదర్శన్‌లో దేశంలోనే మొట్టమొదటి టీవీ టాక్ షో ‘ఫూల్ ఖిలే హై గుల్షన్ గుల్షన్’ని హోస్ట్ చేసిన ఘనత తబస్సుమ్‌కు దక్కుతుంది. ఆమె 1972 నుండి 1993 వరకు ఈ షోని హోస్ట్ చేసింది. దీని ద్వారా తబస్సుమ్ చలనచిత్ర పరిశ్రమలోని అనుభవజ్ఞులను ఇంటర్వ్యూ చేసే అవకాశాన్ని పొందింది.