IPL 2022: ఐపీఎల్ ధనాధన్ కు అంతా రెడీ
నిన్నటి వరకూ ఒకే జట్టుకు ఆడిన ఆటగాళ్ళు ప్రత్యర్థులుగా మారిపోతారు. బుమ్రా బౌలింగ్‌లో వార్నర్ సిక్సర్ కొడితే కేరింతలు కొడతారు.
- By Naresh Kumar Published Date - 12:30 PM, Fri - 25 March 22

నిన్నటి వరకూ ఒకే జట్టుకు ఆడిన ఆటగాళ్ళు ప్రత్యర్థులుగా మారిపోతారు. బుమ్రా బౌలింగ్‌లో వార్నర్ సిక్సర్ కొడితే కేరింతలు కొడతారు. కమ్మిన్స్ బౌలింగ్‌లో విరాట్ ఔటైతే సంబరాలు చేసుకుంటారు.. ఇలాంటి క్రేజీ థింగ్స్ అన్నింటికీ ఒకే వేదిక ఐపీఎల్. విదేశీ, స్వదేశీ ఆటగాళ్ళ మధ్య అంతరాలు చెరిపేస్తూ అభిమానులను అలరిస్తోన్న ఐపీఎల్ 15వ సీజన్ రేపటి నుంచే షురూ కానుంది. ఇక ప్రతీరోజూ బ్యాటర్ల భారీ సిక్సర్లు, బౌలర్ల బుల్లెట్ బంతులు, ఫీల్డర్ మెరుపు విన్యాసాలతో ఫ్యాన్స్‌కు పండుగే పండుగ.
వరల్డ్ క్రికెట్‌లోనే మోస్ట్ క్రేజీయెస్ట్ లీగ్ ఐపీఎల్ మళ్ళీ వచ్చేసింది. గతంతో పోలిస్తే రెండు కొత్త జట్ల ఎంట్రీతో… సరికొత్త ఫార్మేట్‌లో క్రికెట్ ఫ్యాన్స్‌కు కిక్ ఇవ్వబోతోంది. కరోనా కారణంగా రెండేళ్ళ పాటు విదేశాలకే పరిమితమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈ సారి భారత్ వేదికగా..అది కూడా అభిమానుల సందడి మధ్య జరగబోతోంది. 15వ సీజన్‌ను మహారాష్ట్రకే పరిమితం చేసినప్పటకీ.. కోవిడ్ కేసులు తగ్గిపోవడంతో స్టేడియంలో 25 శాతం అభిమానులకు అనుమతించారు. దీంతో రెండేళ్ళ తర్వాత మళ్ళీ క్రికెట్ ఫ్యాన్స్ ఐపీఎల్‌ను స్టేడియాల్లో ప్రత్యక్షంగా వీక్షించబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ సారి రెండు కొత్త జట్లు చేరిన నేపథ్యంలో ఫార్మేట్ కూడా మారింది. 10 జట్లను రెండు గ్రూపులుగా డివైడ్ చేయగా.. ఒక్కో జట్టు అదే గ్రూపులో మిగిలిన జట్లతో రెండేసి సార్లు తలపడనుంది. అలాగే వేరొక గ్రూపులో ఉన్న జట్లతో ఒక్కోసారి ఆడుతుంది. మొత్తం మీద ఒక్కో టీమ్ 14 లీగ్ మ్యాచ్‌లు ఆడనుండగా.. మొదటి 4 స్థానాల్లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి.
గ్రూప్ ఎలో ముంబై , కోల్‌కతా, రాజస్థాన్ , ఢిల్లీ, లక్నో ఉండగా.. గ్రూప్ బిలో చెన్నై ,హైదరాబాద్,బెంగళూరు,పంజాబ్,గుజరాత్ చోటు దక్కించుకున్నాయి. కోవిడ్ ఆంక్షల కారణంగా సీజన్ మొత్తం మహారాష్ట్రలోనే జరగనుంది. ముంబైలోని వాంఖడే,డీవై పాటిల్, బ్రబౌర్న్, పుణేలోని ఎంసీఎ స్టేడియాలు ఈ సీజన్‌కు ఆతిథ్యమిస్తున్నాయి. మొత్తం 70 మ్యాచ్‌లలో వాంఖేడే వేదికగా 20 , బ్రబౌర్న్‌లో 15, డీవై పాటిల్‌లో 20, పుణేలో 15 మ్యాచ్‌లు జరగనున్నాయి. కాగా ఈ సారి ఐపీఎల్ నిబంధనల్లో కొన్ని మార్పులు చేశారు. డీఆర్‌ఎస్ సంఖ్యను రెండుకు పెంచిన బీసీసీఐ సూపర్ ఓవర్ ద్వారా ఫలితం తేలకుంటే పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో ఉన్నట్టు జట్టును విజేతగా ప్రకటిస్తారు. అటు బయోబబూల్ నిబంధనలను కూడా బీసీసీఐ మరింత కఠినతరం చేసింది. గత సీజన్ భారత్‌లో జరిగినప్పుడు బబూల్ బ్రేక్ అవడంతోనే వైరస్ రావడం, తర్వాత టోర్నీని వాయిదా వేసి దుబాయ్ వేదికగా పూర్తి చేశారు. అటువంటి పరిస్థితి మళ్ళీ రిపీట్ కాకుండా ఈ సారి బబూల్ రూల్స్‌ను ఎవరు బ్రేక్ చేసినా కఠిన చర్యలు తీసుకోనుంది. ఆటగాడి లేక వారి కుటుంబసభ్యులతో పాటు ఫ్రాంచైజీ ప్రతినిధులు నిబంధనలు ఉల్లంఘిస్తే కోటి రూపాయల జరిమానాతో పాటు లీగ్ నుంచి సస్పెండ్ చేయనుంది.
మరోవైపు జట్టులో కరోనా సోకి పూర్తి జట్టు అందుబాటులో లేకుంటే మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేయనున్నారు. ఇక కొత్త జట్ల ఎంట్రీతో పాటు దాదాపు ప్రతీ జట్టు కూర్పు మారిపోవడంతో మ్యాచ్‌లన్నీ హోరాహోరీగా సాగడం ఖాయమని అంచనా వేస్తున్నారు. శనివారం డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్, రన్నరప్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య ఆరంభ మ్యాచ్ జరగనుండగా మే 29న ఫైనల్‌తో ఐపీఎల్ 15వ సీజన్ ముగియనుంది. టోర్నీలో 10 జట్లు వేటికవే స్టార్ ప్లేయర్స్‌తో కనిపిస్తున్న వేళ రెండు నెలల పాటు అభిమానులకు టీ ట్వంటీ వినోదం ఖాయంగా కనిపిస్తోంది.