South Korea: దక్షిణ కొరియాలో మరో విషాదం.. ఒక్కసారిగా సొరంగం లోకి మెరుపు వరద?
భారీ వర్షాల కారణంగా దక్షిణ కొరియా పరిస్థితి అతలాకుతలంగా మారిపోయింది. భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తడంతో దక్షిణ కొరియా ప్రజలు గుప్పు గుప్ప
- By Anshu Published Date - 04:10 PM, Sun - 16 July 23

భారీ వర్షాల కారణంగా దక్షిణ కొరియా పరిస్థితి అతలాకుతలంగా మారిపోయింది. భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తడంతో దక్షిణ కొరియా ప్రజలు గుప్పు గుప్పు మంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. ఇప్పటికే వరదలు నానా బీభత్సం సృష్టించగా తాజాగా వరదలు మరో బీభత్సాన్ని సృష్టించాయి. దక్షిణ కొరియాలో భారీ వర్షాల కారణంగా మెరుపు వరదలు ఓకే సొరంగంలోకి ప్రవేశించాయి. ఈ మార్గంలో కనీసం 15 వాహనాలు ఉన్నాయని ప్రస్తుతం అవి మొత్తం నీటిలో మునిగిపోయినట్లు సమాచారం.
దక్షిణ కొరియాలోని చెంగ్జూలోని నాలుగు లైన్ల రహదారి కింద ఉన్న గంగ్‌ప్యోంగ్ సొరంగంలోకి వరద నీరు ప్రవేశించడతో 12 కార్లు, ఒక బస్సు సహా 15 వాహనాలు చిక్కుకుపోయాయి. ఇప్పటికే సొరంగంలో బస్సు నుంచి ఏడు మృతదేహాలను వెలికితీశారు. దీంతో 400 మంది సహాయ బృందాలను ఇక్కడ మోహరించారు. ఈ సొరంగం పొడవు సుమారు 685 మీటర్లు ఉంది. దీనిలోకి పూర్తిగా వరద చేరడంతో చిక్కుకొన్నవారి వద్దకు వెళ్లడం అధికారులకు కష్టంగా మారింది.
శనివారం నగరంలో భారీ వర్షాలు పడటంతో సమీపంలోని మిహోవ్ నది కట్టలు తెంచుకుని నగరంలోకి ప్రవేశించింది.
వరద వేగంగా సొరంగంలోకి చేరడంతో వాహనాల్లో ఉన్నవారు తప్పించుకొనే అవకాశం కూడా లేకుండా పోయింది. ఈ వరదల దాటికి ఇప్పటికే దాదాపు 10 మంది ఆచూకీ గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. భారీ పంపులను తీసుకొచ్చి సొరంగంలో నీటిని బయటకు పంపే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా దక్షిణ కొరియాలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మెరుపు వరదలు, కొండ చరియలు విరిగిపడటం వంటి ఘటనలు చోటు చేసుకొన్నాయి. ఈ ఘటనల్లో ఇప్పటి వరకు దాదాపు 26 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఒక్క ఉత్తర జియోంగ్‌సాంగ్ ప్రావిన్స్‌లోనే 16 మరణాలు సంభవించాయి. వేల సంఖ్యలో ఇళ్లు నీటమునిగాయి. ఇక రాజధాని సియోల్‌లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదంది. ఇక్కడ తొమ్మది మంది మరణిచారు.