Sharmila Vs KCR: ‘కేసీఆర్’ కు ‘షర్మిల’ సవాల్… దమ్ముంటే నాతో పాదయాత్ర చెయ్.!
- Author : HashtagU Desk
Date : 12-03-2022 - 9:23 IST
Published By : Hashtagu Telugu Desk
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినాయకురాలు షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శాసన సభ వేదికగా సీఎం కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని, రాష్ట్రంలో ప్రజాసమస్యలు లేవని మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు. ఈ సందర్భంగా షర్మిల… కేసీఆర్ కు సవాల్ విసిరారు. దమ్ముంటే గులాబీ దళపతి కేసీఆర్ కూడా తనతో పాదయాత్రకు రావాలన్నారు. తెలంగాణలో సమస్యలు లేవని చెబితే…. ముక్కు నేలకు రాస్తానని, క్షమాపణలు చెప్పి పాదయాత్ర చేయకుండా వెళ్లిపోతానని షర్మిల వెల్లడించారు.
ప్రజా సమస్యలు ఉన్నాయని తాను నిరూపిస్తే… సీఎం కేసీఆర్ తన పదవికి రాజీనామా చేసి దళితుడిని సీఎం చేస్తారా…? అని వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు. బంగారు తెలంగాణ అంటూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారన్న షర్మిల…. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోరాటం వల్లే ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడ్డాయని చెప్పుకొచ్చారు. ఇక తన పార్టీ ముందునుంచీ నిరుద్యోగులకు అండగా ఉందని తెలిపారు షర్మిల. ప్రతి మంగళవారం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరుపున ‘నిరుద్యోగ నిరాహార దీక్ష’లు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. రైతులకు అండగా నిలబడ్డామని… అలానే ప్రజాక్షేత్రంలో ప్రజాసమస్యలను పూర్తిస్థాయిలో తెలుసుకునేందుకే పాదయాత్ర చేపట్టినట్లు పేర్కొన్నారు షర్మిల.