Mohanbabu: మోహన్‌బాబుపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దు: సుప్రీంకోర్టు
గత నెల 23న తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. దాన్ని సవాల్ చేస్తూ మోహన్‌బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే నేడు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.
- By Latha Suma Published Date - 12:06 PM, Thu - 9 January 25

Mohanbabu: సుప్రీంకోర్టులో సినీనటుడు మంచు మోహన్‌బాబుకు ఊరట లభించింది. ముందస్తు బెయిల్ పై విచారణ జరుగుతోందని, ఆ విచారణ ముగిసేంతవరకు మోహన్‌బాబును అరెస్ట్ చేయవద్దని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. మీడియా ప్రతినిధిపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం మోహన్‌బాబు ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులోనే ఆయన దాఖలు చేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను గత నెల 23న తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. దాన్ని సవాల్ చేస్తూ మోహన్‌బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే నేడు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు మోహన్‌బాబుపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.
సినీ నటుడు మోహన్ బాబు తరఫున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించారు. కొడుకుతో గొడవల సందర్భంగా ఈ ఘటన జరిగిందన్నారు. జర్నలిస్ట్ పై జరిగిన దాడికి బహిరంగంగా క్షమాపణ చెప్పినట్లు వెల్లడించారు. నష్ట పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారని, కావాలని దాడి చేయాలని న్యాయస్థానానికి తెలిపారు. జర్నలిస్టులు బలవంతంగా ఇంట్లోకి వచ్చినట్లు తెలిపారు. ఇంట్లోకి వచ్చినంత మాత్రాన జర్నలిస్టుపై దాడి చేస్తారా ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.
కాగా, మోహన్ బాబు జర్నలిస్టుపై దాడి చేయడం వల్ల ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో హత్యాయత్నం ఆరోపణలపై మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా కోర్టు ఆదేశాల ఉల్లంఘన.. గత నెల డిసెంబర్ 24న పోలీసుల ముందు హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ ఆదేశాలను ఆయన పాటించలేదు. ఈ క్రమంలో మోహన్ బాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. దీంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించారు.