Putin Angry : వాగ్నెర్ గ్రూప్ సైనిక తిరుగుబాటు దేశద్రోహమే.. కఠినంగా శిక్షిస్తాం : పుతిన్
- Author : Pasha
Date : 24-06-2023 - 1:23 IST
Published By : Hashtagu Telugu Desk
స్వయంగా తాను తయారు చేసిన ప్రైవేటు సైన్యం వాగ్నెర్ గ్రూప్ తిరుగుబాటుపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. వాగ్నెర్ గ్రూప్ అధిపతి యెవ్జెనీ ప్రిగోజిన్ దేశద్రోహం చేస్తున్నాడని మండిపడ్డారు. రష్యా సైన్యంపై, రష్యా ప్రజలపై తిరుగుబాటు చేసిన వారిని.. వెన్నుపోటు పొడిచిన వారిని కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు. ఇప్పటికే దీనిపై సైన్యానికి తగిన ఆర్డర్స్ ఇచ్చానని వెల్లడించారు. “రష్యన్లు ఐక్యంగా ఉండాలి. మేము అంతర్యుద్ధాన్ని జరగనివ్వం” అని తేల్చి చెప్పారు.
Also read : Russia Vs Wagner Group : రష్యాలో సైనిక తిరుగుబాటు ? తిరగబడిన కిరాయి సైన్యం వాగ్నెర్ గ్రూప్
“వాగ్నెర్ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ వ్యక్తిగత ప్రయోజనాల కోసం.. ఏదో దురుద్దేశంతో రష్యాకు ద్రోహం చేశాడు. అతడి నుంచి రష్యాకు ఘోరమైన ముప్పు ఉంది. అతడిపై మా చర్య కఠినంగా ఉంటుంది” అని పుతిన్ స్పష్టం చేశారు. వాగ్నెర్ గ్రూప్ అధిపతి యెవ్జెనీ ప్రిగోజిన్ కు చెందిన ప్రైవేట్ ఆర్మీ రష్యన్ నగరాలు రోస్టోవ్-ఆన్-డాన్, వొరోనెజ్‌లలోని కొన్ని భాగాలను స్వాధీనం చేసుకున్నాయని వార్తలు వచ్చాయి. ఈనేపథ్యంలోనే పుతిన్ అత్యవసరంగా ప్రెస్ మీట్ పెట్టి ఈ కామెంట్స్ చేశారు.
Also read : Russia Private Army Explained : పుతిన్ చెఫ్ పెట్టిన ప్రైవేటు సైన్యం..అసలు కథ