Private Travels Hikes: దసరా పండుగ సందర్భంగా ఆ బస్సుల్లో ప్రత్యేక దోపిడీ!
- By Kode Mohan Sai Published Date - 04:25 PM, Fri - 11 October 24

Private Travels Hikes: దసరా పండుగ సందర్భంలో స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమైన ప్రయాణికుల నుంచి కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ అడ్డు అదుపు లేకుండా దోచుకుంటున్నాయి. సాధారణ ఛార్జీలకు భిన్నంగా ఒక్కసారిగా రేట్లు పెంచడం, ట్రాఫిక్ అధికంగా ఉందని, అన్ని బస్సుల్లో సీట్లు నిండిపోయాయని చెప్పి అధిక ధరలు వసూలు చేస్తున్నాయి. రైళ్లలో బెర్తులు ఖాళీ లేకపోవడం, ఆర్టీసీ బస్సుల్లో సీట్లు కొరతగా ఉండటంతో ప్రయాణికులకు ప్రైవేటు ట్రావెల్స్‌ను ఎంచుకోవడం తప్ప వేరే మార్గం లేదు.
సొమ్ము చేసుకుంటున్న ప్రైవేటు ట్రావెల్స్:
శనివారం దసరా పండుగ, ఆదివారం సెలవు కావడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు శుక్రవారం సొంతూర్లకు బయల్దేరుతున్నారు. ఈ పరిస్థితిని చూస్తూ ట్రావెల్స్ సంస్థలు నష్టాన్ని అధిగమించుకోవడానికి ఛార్జీలను పెంచుతున్నాయి. రాష్ట్రంలో 1,200 వరకు ట్రావెల్స్ బస్సులు ఉండగా, ప్రముఖ ప్రైవేటు సంస్థలు ఈ ఛార్జీల పోటీలో పాల్గొంటున్నాయి.
సాధారణ రోజులకు సరిపోల్చి, ఈ రెండు రోజుల్లో ఏసీ బస్సుల్లో సగటున ఒక్కో సీటుకు రూ. 1,000, నాన్ ఏసీ బస్సుల్లో రూ. 700 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు, విజయవాడ నుండి విశాఖపట్నానికి లేదా హైదరాబాద్ నుంచి విజయవాడకు పలు ప్రైవేటు ట్రావెల్స్ ఏసీ బస్సుల్లో ఒక్కో బెర్త్‌కు రూ. 2,000 నుంచి రూ. 2,500 వరకు చార్జీలు పెంచారు.
ఆర్టీసీ ఏసీ ఇంద్ర సర్వీసులో విజయవాడ నుండి విశాఖపట్నానికి సీటుకు రూ. 905, అమరావతి బస్సులో రూ. 1,120 కాగా, నాన్ ఏసీ సూపర్ లగ్జరీలో రూ. 704 మాత్రమే ఉంది. ప్రైవేటు ట్రావెల్స్‌తో పోలిస్తే ఈ రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ, అనేక బస్సుల్లో కేవలం ఒక్కట్రెండు సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఫలితంగా, కుటుంబంతో కలిసి ఊళ్లకు వెళ్ళేవారు ప్రైవేటు ట్రావెల్స్‌కు ఆశ్రయించడం తప్ప మరొక దారి లేదు.
విజయవాడ నుండి ఉత్తరాంధ్ర, నెల్లూరు, తిరుపతి, రాయలసీమ జిల్లాల ముఖ్య పట్టణాలకు వెళ్లే సర్వీసుల్లో ఛార్జీల రేటు అధికంగా ఉంది.
తిరుగు ప్రయాణంలో దోపిడీ మరింత పెరుగుతోంది:
దసరా పండుగ సెలవులు ఆదివారంతో ముగియనుండగా, అనేక విద్యాసంస్థలు సోమవారమే తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో, తిరుగు ప్రయాణం చేసే ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆదివారం సాయంత్రం నుంచి బయల్దేరే సర్వీసులకు భారీ డిమాండ్ ఏర్పడింది. సాధారణ ఛార్జీల కంటే రెండు రెట్లు ఎక్కువగా రాబడుతున్నారు. విశాఖపట్నం-విజయవాడ మధ్య పలుచోట్ల 3,000 రూపాయలకు పైగా ఛార్జీ వసూలు చేస్తున్నారు. ట్రావెల్స్ సంస్థలు టికెట్ ఛార్జీలను ఆన్‌లైన్‌లో దర్జాగా ప్రదర్శిస్తున్నప్పటికీ, రవాణా శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల నుంచి రాష్ట్రంలోని వివిధ పట్టణాలకు అధిక ఛార్జీలతో రాకపోకలు సాగిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌పై కూడా పరిశీలనలు జరగడం లేదు.