Phone Tapping Case : హరీష్‌రావు పై కేసు నమోదు
సిద్దిపేటలో తన స్వచ్ఛంద కార్యక్రమాలకు ప్రజల మద్దతు లభించిందని చక్రధర్ గౌడ్ వివరించారు. ఇది హరీష్ రావుతో రాజకీయ పోటీని సృష్టించిందని వివరించారు. ఈ నేపథ్యంలో తనపై తప్పుడు కేసులు పెట్టించారని చెప్పారు.
- By Latha Suma Published Date - 12:49 PM, Tue - 3 December 24

Phone Tapping Case : పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు పై కేసు నమోదైంది. ఫోన్ ట్యాప్ చేసి అక్రమ కేసులు పెట్టి వేధించారని సిద్దిపేటకు చెందిన చక్రధర్ అనే వ్యక్తి మాజీ మంత్రి హరీష్‌రావుపై ఫిర్యాదు చేశారు. హరీష్ రావు, మాజీ డిసిపి రాధా కిషన్‌రావు కలిసి తన ఫోన్ ట్యాపప్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. 120(B), 386, 409 ఐటీ యాక్ట్ 2008 కింద కేసులు నమోదు చేశారు.
అయితే తాను ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తున్నానని, ఈ నేపథ్యంలో హరీష్ రావు బెదిరింపులకు దిగారని చక్రధర్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిద్దిపేటలో తన స్వచ్ఛంద కార్యక్రమాలకు ప్రజల మద్దతు లభించిందని చక్రధర్ గౌడ్ వివరించారు. ఇది హరీష్ రావుతో రాజకీయ పోటీని సృష్టించిందని వివరించారు. ఈ నేపథ్యంలో తనపై తప్పుడు కేసులు పెట్టించారని చెప్పారు. ఘటన్‌కేసర్, సీసీఎస్, ఇతర పోలీస్ స్టేషన్లలో తనపై తప్పుడు కేసులు పెట్టారని చక్రధర్ గౌడ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాక..తనకు హరీష్ రావు నుంచి బెదిరింపు సందేశాలు వచ్చాయని చక్రధర్ గౌడ్ వివరించారు.
ఆగస్టు 2023లో ఆపిల్ సంస్థ నుంచి వచ్చిన ఇమెయిల్‌ను ఫిర్యాదుకు జతపరిచారు. 2023 ఎన్నికల సమయంలో తన ఫోన్, తన భార్య ఫోన్, తన సహచరుల ఫోన్‌లను ట్యాప్ చేశారని ఆరోపించారు. సిద్ధిపేటలో రాజకీయ కార్యకలాపాలను ఆపాలని హెచ్చరించినట్టు స్పష్టం చేశారు. అదే సమయంలో తన ఫోన్‌ను ట్యాప్ చేశారని ఫిర్యాదులో వివరించారు. ఆయన ఫిర్యాదుపై పరిశీలించిన పోలీసులు.. డిసెంబరు 1, 2024న స్వీకరించారు. ఆ తర్వాత పంజాగుట్ట పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
కాగా, జూబ్లీహిల్స్ ఏసీపీకి తన ఫోన్ ను ట్యాపింగ్ చేశారని సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై నవంబర్ 18న జూబ్లీహిల్స్ పోలీసుల విచారణకు ఆయన హాజరయ్యారు. చక్రధర్ గౌడ్ నుంచి ఆయన పోలీసులు వివరాలు తీసుకున్నారు. తన డ్రైవర్ తో పాటు కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని ఆయన ఆ ఫిర్యాదులో చెప్పారు. తన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అడిగిన సమాచారం ఇచ్చినట్టు నవంబర్ 18న ఆయన మీడియాకు చెప్పారు. అప్పటి ఇంటలిజెన్స్ డీసీపీ రాధాకిషన్ రావు తనను బెదిరించారని కూడా ఆయన ఆరోపించారు.
ఇకపోతే..ఇటీవల తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పలువు అధికారులను విచారించి అరెస్టు చేశారు. లీడర్లకి కూడా నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని చెప్పారు. ఈ మధ్య ఒకరిద్దర్ని విచారించారు. ఇప్పుడు ఏకంగా మాజీ మంత్రి హరీష్‌రావుపైనే ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు అయింది.