Petrol And Diesel Prices: పెట్రోల్ ధరలకు రెక్కలు.. సామాన్యుడి జేబుకి చిల్లి తప్పదా..?
- Author : HashtagU Desk
Date : 07-03-2022 - 4:52 IST
Published By : Hashtagu Telugu Desk
ఇండియాలో ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల పోలింగ్ నేటితో ముగియనున్నాయి. ఈ క్రమంలో దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగే అవకాశం తెలుస్తోంది. ప్రతిష్టాత్మకంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో మూడు నెలల నుంచి పెట్రోల్, డీజిల్ రేట్లపై రోజువారీ ధరల పెంపు ప్రక్రియను తాత్కాలికంగా ఆపివేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికలు పూర్వడంతో రేపటి నుంచి పేట్రోల్, డీజిల్ రేట్లు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఈ క్రమంలో రాబోయే నెలరోజుల్లో లీటర్ పెట్రోల్ ధర ఏపీలో రూ.158కి, తెలంగాణలో లీటర్ రూ.155కి చేరనుందని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో మరోసారి సామాన్యుడిపై భారం తప్పేలా లేదని సర్వత్రా చర్చించుకుంటున్నారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతోన్న యుద్ధం కారణంగా భారత్ సహా ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ క్రమంలో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర విపరీతంగా పెరిగిపోయింది. దీంతో మన దేశంలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు రానున్నాయి. చమురు కంపెనీలు పెట్రోల్ లీటరుకు దాదాపు 12 నుంచి 25 రూపాయల వరకు పెంచే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో సామాన్యుని జేబుకు చిల్లుపడటం ఖాయమని సర్వత్రా చర్చించుకుంటున్నారు.