Pawan Kalyan: ‘జగన్’ పాలనలో రక్షణ కరువవుతోంది!
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మానసిక పరిపక్వత లేని యువతిపై ముగ్గురు దుర్మార్గులు అత్యాచారం చేసిన ఘటన తీవ్రంగా కలచివేసిందని అన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్.
- By Hashtag U Published Date - 05:49 PM, Fri - 22 April 22

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మానసిక పరిపక్వత లేని యువతిపై ముగ్గురు దుర్మార్గులు అత్యాచారం చేసిన ఘటన తీవ్రంగా కలచివేసిందని అన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఈ అఘాయిత్యానికి ఒడిగట్టింది ఆసుపత్రిలో పని చేస్తున్నవారే కావడం చూస్తుంటే అక్కడి నిఘా, సెక్యూరిటీ ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో అర్థం అవుతోంది. తమ బిడ్డ కనిపించడం లేదని కన్నవారు నున్న పోలీసులను ఆశ్రయించి ఓ యువకుడిపై అనుమానం వ్యక్తం చేసినా.. బాధ్యత కలిగిన అధికారుల నుంచి కనీస స్పందన లేకపోవడం దురదృష్టకరం. సత్వరమే స్పందించి ఉంటే మానసిక పరిపక్వత లేని యువతికి 30 గంటల నిర్బంధం, ఆమెపై ఘోర అఘాయిత్యం జరిగేవా? నిందితులను శిక్షించాలని గొంతెత్తిన జనసేన నాయకులూ, ఇతర పార్టీలవారిపై కేసులు నమోదు చేయడంలో చూపిన చురుకుదనం ఒక ఆడబిడ్డ ఆచూకీ తీయడంలో చూపించాల్సింది.
మహిళల రక్షణ కోసం దిశ చట్టం చేసినా ఇప్పటికీ ఆ చట్టం అమలులోకి రాలేదు. ఆ చట్టం ద్వారా నిందితులను శిక్షించే పరిస్థితి లేదు కాబట్టి పోలీసులే ఆడ బిడ్డల రక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఎంతో ఆందోళన, ఆవేదనతో పోలీసులను ఆశ్రయించే తల్లితండ్రులకు భరోసా ఇచ్చేలా సత్వర స్పందన అవసరం. రాష్ట్రంలో మహిళలపై ఆఘ్యాయిత్యాలు ఏటేటా పెరుగుతున్న వాస్తవం విస్మరించలేనిది. 2020తో పోల్చుకొంటే 2021లో ఈ కేసులు 25 శాతం పెరిగాయని గత డీజీపీ స్వయంగా ప్రకటించారు. ఇకనైనా పాలక పక్షం- పోలీసు వ్యవస్థను తమ రాజకీయ అవసరాలు, ప్రతిపక్ష పార్టీలపై కక్ష సాధింపుల కోసం కాకుండా ప్రజలకు రక్షణ నిమిత్తం వినియోగించాలి. విజయవాడ జీజీహెచ్ లో సామూహిక అత్యాచార ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలి. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించటంతోపాటు ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి. అలాగే దిశ చట్టం ఎప్పటి నుంచి అమలవుతుందో కూడా ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.