Nimisha Priya : నిమిష ప్రియ మరణశిక్ష కేసు మళ్లీ మలుపు..ఉరిశిక్ష రద్దు కాలేదని కేంద్రం స్పష్టం
అయితే ఈ ప్రకటనపై స్పందించిన భారత విదేశాంగ శాఖ వర్గాలు, ఆ సమాచారం అసత్యమని తేల్చిచెప్పాయి. నిమిష ప్రియ ఉరిశిక్షకు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి మార్పులు లేవని, ఈ మేరకు యెమెన్ నుంచి తమకు అధికారిక సమాచారం అందలేదని స్పష్టం చేశాయి. దీంతో ఈ కేసు మరోసారి అస్థిరతలోకి వెళ్లింది.
- By Latha Suma Published Date - 09:47 AM, Tue - 29 July 25

Nimisha Priya : యెమెన్‌లో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిష ప్రియ కేసు మరోసారి కీలక మలుపు తిరిగింది. తాజాగా ఆమె ఉరిశిక్ష రద్దు అయిందని వచ్చిన వార్తల నేపథ్యంలో ప్రజల్లో ఆశలు చిగురించగా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వాటిని తోసిపుచ్చింది. విదేశాంగ శాఖ మంగళవారం స్పష్టం చేస్తూ, నిమిష ప్రియ ఉరిశిక్ష ఇప్పటివరకు రద్దు కాలేదని, యెమెన్ నుంచి ఎటువంటి అధికారిక సమాచారం రాకపోవడంతో ఈ వార్తలు నిజానికి దూరమని తెలియజేసింది.
సోమవారం అర్ధరాత్రి భారత గ్రాండ్ ముఫ్తీ, సున్నీ మత నేత కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం ఓ ప్రకటన చేసింది. నిమిష ప్రియ విషయంలో తన విజ్ఞప్తి మేరకు యెమెన్‌కు చెందిన సూఫీ మతపెద్ధ షేక్ హబీబ్ ఒమర్ బిన్ హఫీజ్ ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, యెమెన్ అధికారులతో సంప్రదింపులు జరిపారని పేర్కొంది. ఆ చర్చలు సానుకూలంగా జరగడంతో అధికారులు ఉరిశిక్షను రద్దు చేయడానికి అంగీకరించారని ముఫ్తీ కార్యాలయం పేర్కొంది.
Read Also: Today Gold Rate : మళ్లీ పెరిగిన బంగారం ధర..శ్రావణ మాసంలో కొనుగోలుదారులకు షాక్
అయితే ఈ ప్రకటనపై స్పందించిన భారత విదేశాంగ శాఖ వర్గాలు, ఆ సమాచారం అసత్యమని తేల్చిచెప్పాయి. నిమిష ప్రియ ఉరిశిక్షకు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి మార్పులు లేవని, ఈ మేరకు యెమెన్ నుంచి తమకు అధికారిక సమాచారం అందలేదని స్పష్టం చేశాయి. దీంతో ఈ కేసు మరోసారి అస్థిరతలోకి వెళ్లింది. నిమిష ప్రియ కేసు గతంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. యెమెన్‌కు చెందిన వ్యక్తిని హత్య చేసిన ఆరోపణలపై ఆమెకు అక్కడి కోర్టు మరణశిక్ష విధించింది. ఈ ఏడాది జులై 16న ఉరిశిక్ష అమలుకావాల్సి ఉండగా, చివరి క్షణంలో యెమెన్ ప్రభుత్వం దాన్ని వాయిదా వేసింది. భారత ప్రభుత్వం, బ్లడ్ మనీ చెల్లింపు ద్వారా పరిష్కారం కోసం బాధిత కుటుంబంతో చర్చలు జరిపేందుకు మరింత సమయం ఇవ్వాలని కోరగా, యెమెన్ పాజిటివ్‌గా స్పందించింది.
అయితే బాధిత కుటుంబం మాత్రం తమకు బ్లడ్ మనీ అవసరం లేదని స్పష్టం చేస్తోంది. వారు చెల్లింపు మార్గాన్ని పూర్తిగా ఖండించిన నేపథ్యంలో కేసు భవితవ్యం ఇంకా అనిశ్చితిలో ఉంది. ఒకవేళ బాధిత కుటుంబం ఒప్పుకోకపోతే, నిమిష ప్రియ ప్రాణాలను కాపాడే మార్గాలు మరింత సంక్లిష్టం కావొచ్చు. భారత ప్రభుత్వం ఈ కేసును కీలకంగా తీసుకుంటోంది. కేంద్ర విదేశాంగ శాఖ, న్యాయ సహాయం, మానవతా దృష్టికోణంలో యెమెన్ అధికారులతో కొనసాగుతున్న చర్చలపై దృష్టి పెట్టింది. నిమిష ప్రియకు ఉరిశిక్ష రద్దు చేయించేందుకు ప్రభుత్వం అన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం నిమిష ప్రియ కేసు ఆగిపోయినట్టే అనిపించినా, మళ్లీ ముందుకు వెళ్లే అవకాశాలుంటే అవి బ్లడ్ మనీ ఒప్పందంపై ఆధారపడి ఉంటాయి. ఒకవేళ మతపెద్ధలు మధ్యవర్తిత్వం ద్వారా మరోసారి చర్చలకు తలుపులు తెరవగలిగితే, నిమిష ప్రియ జీవితంలో ఆశల జ్యోతి మళ్లీ వెలుగుతుందనే నమ్మకంతో ఆమె కుటుంబం, మద్దతుదారులు ఎదురుచూస్తున్నారు.
Read Also: CM Chandrababu : సింగపూర్‌లొ సీఎం చంద్రబాబు మూడో రోజు పర్యటన..పెట్టుబడులపై కీలక సమావేశాలు!