Mitchell Marsh:టెన్షన్ లో ఢిల్లీ క్యాపిటల్స్
- By Hashtag U Published Date - 11:01 PM, Wed - 13 April 22

ఐపీఎల్-2022 సీజన్‌లోని మరికొన్ని మ్యాచులకు ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గాయం కారణంగా దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఐపీఎల్-15వ సీజన్ మెగా వేలంలో భాగంగా మార్ష్‌ను ఢిల్లీ క్యాపిటిల్స్ 6.5 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తుంటి ఎముక గాయంతో బాధపడుతున్న మార్ష్ ఇంకా కోలుకొని నేపథ్యంలో టోర్నీలోని మరికొన్ని మ్యాచులకు దూరంగా ఉండనున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. ఒక రకంగా ఢిల్లీ క్యాపిటల్స్ కు షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు.. ఒకవేళ మార్ష్ గాయం నుంచి కోలుకోకపోతే అతను ఐపీఎల్ 2022 లో రాబోయే మ్యాచుల్లో ఆడేది కూడా అనుమానమేనని తెలుస్తోంది. ఈ వార్త తెలిసి ఢిల్లీ క్యాపిటల్స్ ఉలిక్కిపడింది.
2011లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన మిచెల్ మార్ష్ ఆస్ట్రేలియా తరపున 32 టెస్టులు, 63 వన్డేలు, 36 టి20లు ఆడాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 21 మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 16న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడాల్సి ఉంది.. ప్రస్తుత సీజన్లో 4 మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరోస్థానంలో ఉంది. ఇక మరోవైపు ఈ ఐపీఎల్లో ఇప్పటికే 22 మ్యాచ్‌లు ముగియగా.. పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ మూడు విజయాలతో టాప్‌లో ఉంది. ఆ తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ కూడా మూడేసి విజయాలో టాప్-4లో కొనసాగుతున్నాయి.