MI vs PBKS: మొహాలీలో దంచికొట్టిన ముంబై… హైస్కోరింగ్ మ్యాచ్‌లో పంజాబ్‌పై ఘనవిజయం
ఐపీఎల్ 16వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ పూర్తి ఫామ్‌లోకి వచ్చేసింది.
- By Naresh Kumar Published Date - 11:31 PM, Wed - 3 May 23

MI vs PBKS: ఐపీఎల్ 16వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ పూర్తి ఫామ్‌లోకి వచ్చేసింది. సీజన్ ఆరంభంలో వరుస పరాజయాలతో సతమతమైన ముంబై ఎప్పటిలానే సెకండాఫ్‌లో చెలరేగిపోతోంది. తాజాగా మరో హైస్కోర్‌ను ఛేజ్ చేసి అదరగొట్టింది.
మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 215 పరుగుల టార్గెట్‌ను 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ 13 పరుగులకే ఫామ్‌లో ఉన్న ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ వికెట్ కోల్పోయింది. అయితే కెప్టెన్ ధావన్, మాథ్యూ షార్ట్ ధాటిగా ఆడడంతో పవర్ ప్లేలో 50 పరుగులు చేసింది. ధావన్ 20 బంతుల్లో 5 ఫోర్లతో 30 రన్స్ చేయగా.. షార్ట్ 27 పరుగులకు ఔటయ్యాడు. ఈ దశలో పంజాబ్ స్కోరును లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ పరిగెత్తించారు.
భారీ షాట్లతో ముంబై బౌలర్లపై ఆధిపత్యం కనబరిచారు. జితేశ్ శర్మ బ్యాటింగ్ ఆకట్టుకుంది. కేవలం 27 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 49 పరుగులు చేశాడు. అటు లివింగ్‌స్టోన్ కూడా విధ్వంకర ఇన్నింగ్స్‌తో రెచ్చిపోయాడు. ముంబై బౌలర్లపై ఎదురుదాడికి దిగిన లివింగ్‌స్టోన్ కేవలం 42 బంతుల్లోనే 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 82 పరుగులు చేశాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు అజేయంగా 119 పరుగులు జోడించారు. చివరి ఐదు ఓవర్లలో పంజాబ్ 67 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో చావ్లా 2, అర్షద్‌ఖాన్ 1 వికెట్ పడగొట్టారు.
భారీ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో ముంబై తొలి ఓవర్‌లోనే వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రోహిత్‌శర్మ డకౌటవగా.. కామెరూన్ గ్రీన్, ఇషాన్ కిషన్ ఆదుకున్నారు. ధాటిగా ఆడిన గ్రీన్ 18 బంతుల్లో 23 పరుగులకు ఔటయ్యాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ ఎంట్రీతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. చెరొక ఎండ్ నుంచీ ఇషాన్ కిషన్, సూర్యకుమార్ భారీ షాట్లతో పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు.
ఎడాపెడా సిక్సర్లు, ఫోర్లతో స్కోరు బోర్డును టాప్ గేర్‌లో పరిగెత్తించారు. వీరిద్దరి జోరుకు పంజాబ్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. అర్షదీప్‌సింగ్ 3.5 ఓవర్లలోనే 66 పరుగులు ఇవ్వగా.. శామ్ కరన్ 3 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చాడు. నాథన్ ఎల్లిస్ ఒక్కడే 2 వికెట్లతో పర్వాలేదనిపించాడు. సూర్యకుమార్ యాదవ్ 31 బంతుల్లోనే 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 66 పరుగులు చేయగా… ఇషాన్ కిషన్ 41 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 75 రన్స్ చేశాడు.
చివర్లో వీరిద్దరూ ఔటైనా.. టిమ్ డేవిడ్ , తిలక్ వర్మ జట్టు విజయాన్ని పూర్తి చేశారు. మరోసారి ఫామ్ కొనసాగించిన తిలక్ వర్మ కేవలం 10 బంతుల్లోనే 3 భారీ సిక్సర్లు, 1 ఫోర్‌తో 26 రన్స్ చేశాడు. దీంతో ముంబై 18.5 ఓవర్లలోనే టార్గెట్‌ను ఫినిష్ చేసింది. ఈ సీజన్‌లో ముంబైకి ఇది ఐదో విజయం.
That's that from Match 46.@mipaltan register a 6-wicket win against #PBKS to add to crucial points to their tally.#MI chase down the target in 18.5 overs.
Scorecard – https://t.co/IPLsfnImuP #TATAIPL #PBKSvMI #IPL2023 pic.twitter.com/SeKR48s9Vv
— IndianPremierLeague (@IPL) May 3, 2023