Hyderabad : పోలీసుల ఎదుట లొంగిపోయిన సెంట్రల్ కమిటీ మావోయిస్టు సభ్యులు
ఇద్దరికి విస్తృతంగా మావోయిస్టు ఉద్యమానుభవం ఉండటంతో ఈ లొంగింపు విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. కాకరాల సునీత గతంలో పీపుల్స్ వార్ పార్టీలో పనిచేశారు. ఆమె తండ్రి ఒక విప్లవ రచయితల సంఘం నేతగా ఉన్నారని సీపీ తెలిపారు. చిన్ననాటి నుంచే వరవరరావు, గద్దర్ వంటి విప్లవకారుల సాన్నిహిత్యం సునీతను మావోయిస్టు సిద్ధాంతాల వైపు ఆకర్షించిందని వివరించారు.
- By Latha Suma Published Date - 02:00 PM, Thu - 21 August 25

Hyderabad : రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఎదుట గురువారం ఇద్దరు మావోయిస్టు సెంట్రల్ కమిటీ కీలక సభ్యులు లొంగిపోయారు. వీరిలో ఒకరు మావోయిస్టు సీనియర్ స్టేట్ కమిటీ సభ్యురాలు కాకరాల సునీత కాగా, మరొకరు చెన్నూరి హరీశ్ అలియాస్ రమణగా పోలీసులు గుర్తించారు. ఇద్దరికి విస్తృతంగా మావోయిస్టు ఉద్యమానుభవం ఉండటంతో ఈ లొంగింపు విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. కాకరాల సునీత గతంలో పీపుల్స్ వార్ పార్టీలో పనిచేశారు. ఆమె తండ్రి ఒక విప్లవ రచయితల సంఘం నేతగా ఉన్నారని సీపీ తెలిపారు. చిన్ననాటి నుంచే వరవరరావు, గద్దర్ వంటి విప్లవకారుల సాన్నిహిత్యం సునీతను మావోయిస్టు సిద్ధాంతాల వైపు ఆకర్షించిందని వివరించారు. 1986లో మావోయిస్టు నేత గౌతమ్ అలియాస్ సుధాకర్‌ను వివాహం చేసుకున్న సునీత, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో సెంట్రల్ ఆర్గనైజర్‌గా పనిచేశారు.
Read Also: AP : మద్యం కేసులో కీలక పరిణామం..రాజ్ కెసిరెడ్డి ఆస్తుల జప్తునకు ఉత్తర్వులు
ఆ తరువాత 1992లో నల్లమల అడవుల్లోకి వెళ్లిన ఆమె, 2001లో ఆంధ్ర–ఒడిషా సరిహద్దు ప్రాంతానికి బదిలీ అయ్యారు. 2006లో మరింత లోతైన దండకారణ్య ప్రాంతంలో కార్యకలాపాలు కొనసాగించారు. ఆమె విస్తృతంగా మావోయిస్టు ఉద్యమంలో పాలుపంచుకున్నారు. పలు కీలక ఎన్‌కౌంటర్లలో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక, చెన్నూరికి చెందిన హరీశ్ అలియాస్ రమణ, పదో తరగతి చదువుతున్న సమయంలోనే మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. ఏటూరునాగారంలో ఉన్న బీసీ వెల్ఫేర్ హాస్టల్‌లో ఉన్న సమయంలో మావోయిస్టు భావజాలం ప్రభావం చూపిందని పోలీసులు వెల్లడించారు. అనంతరం ఆయన 2024లో ఏరియా కమాండర్‌గా (ఏసీఏ) పనిచేశారు. ఆయన కూడా పలు మావోయిస్టు కార్యకలాపాలలో, ఎన్‌కౌంటర్లలో పాల్గొన్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో సీపీ సుధీర్‌బాబు మాట్లాడుతూ..ఇద్దరూ జనజీవన స్రవంతిలోకి అడుగుపెడుతున్నట్టు ప్రకటించడం ఒక మంచి పరిణామం. వీరి లాంటి ప్రముఖుల మావోయిస్టు మార్గాన్ని విడిచిపెట్టి సామాజిక జీవితాన్ని ఎంచుకోవడం, సమాజానికి నూతన దిశగా మార్పును సూచిస్తుంది. యువతకు ఇది ఓ మంచి సందేశం అని వ్యాఖ్యానించారు. లొంగింపు తర్వాత మావోయిస్టు ఉద్యమానికి సంబంధించి కీలక సమాచారం పోలీసులకు అందే అవకాశముందని భావిస్తున్నారు. ఇక,పై వారు ప్రభుత్వ పునరావాస పథకాల ద్వారా సామాజిక జీవనానికి మళ్లేలా చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం.