Telangana : స్టేషన్ ఘనపూర్ లో రాజయ్యకు పెరుగుతున్న మద్దతు..
తాటికొండ రాజయ్యకు డిప్యూటీ సీఎం పదవి పోవడానికి కూడా కడియం శ్రీహరి కారణమని
- By Sudheer Published Date - 03:39 PM, Tue - 29 August 23

తెలంగాణ లో ఎన్నికలు సమీపిస్తుండడం తో బిఆర్ఎస్ (BRS) సర్కార్ ఈసారి అందరి కంటే ముందే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను (BRS Candidates List) ప్రకటించి ఎన్నికల వేడి మొదలుపెట్టింది. కాగా ఈసారి కూడా ఎక్కువగా సిట్టింగ్ ఎమ్మెల్యేల కే అవకాశం కల్పించారు కేసీఆర్. కాకపోతే కొన్ని చోట్ల మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు. వారిలో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (MLA Thatikonda Rajaiah) ఒకరు.
తాటికొండ రాజయ్య ను కాదని కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు. దీంతో రాజయ్య వర్గం అధిష్టానం ఫై ఆగ్రహంగా ఉన్నారు. బయటకు కడియం కు మద్దతు ఇస్తామని చెపుతున్నప్పటికీ మాత్రం లోలోపల మాత్రం కడియం కు మద్దతు ఇచ్చేదేలే అన్నట్లుగా ఉన్నారు. ఈ క్రమంలో తాటికొండ రాజయ్య కు రోజు రోజుకు మద్దతు పెరుగుతుంది. ఇప్పటికే అయన అనుచరులు , కుల సంఘాలు రాజయ్య కు అన్యాయం చేసారని వాపోతుండగా..తాజాగా ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా రాజయ్య కు సపోర్ట్ పలికారు. కడియం శ్రీహరికి బీఆర్ఎస్ బీ ఫాం ఎలా వస్తుందో చూస్తానని హెచ్చరించారు.
Read Also : Telangana: ఎకరాకు లక్ష: కేసీఆర్ బాగోతం, హైకోర్టు మొట్టికాయలు
తాటికొండ రాజయ్యకు డిప్యూటీ సీఎం పదవి పోవడానికి కూడా కడియం శ్రీహరి కారణమని ఆయన ఆరోపించారు. కడియం శ్రీహరి (Kadiyam Srihari)కి స్టేషన్ ఘన్ పూర్ నుండి బీఆర్ఎస్ టిక్కెట్టు ఇవ్వొద్దని ఆయన కోరారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన సీటును మాదిగ సామాజిక వర్గానికే కేటాయించాలన్నారు. రాజయ్యకు టిక్కెట్టు ఇవ్వకపోతే మరో మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతకు బీఆర్ఎస్ టిక్కెట్టు ఇవ్వాలని మందకృష్ణ మాదిగ కోరారు.
ఇక 2014, 2018 ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా రాజయ్య విజయం సాధించారు. 2014 లో కేసీఆర్ మంత్రివర్గంలో రాజయ్యకు డిప్యూటీ సీఎం పదవి దక్కింది. అయితే కొంత కాలానికే రాజయ్యను మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేశారు. ఆయన స్థానంలో కడియం శ్రీహరికి అవకాశం కల్పించారు . 2018 ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ నుండి ఎమ్మెల్యేగా పోటీకి కడియం శ్రీహరి ఆసక్తిని చూపారు. అయితే రాజయ్యకే కేసీఆర్ అవకాశం కల్పించారు. రాజయ్య విజయం కోసం కడియం శ్రీహరి ఆనాడు కృషి చేశారు. అయితే ఇటీవల స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాలతో రాజయ్యను తప్పించి ఆ స్థానంలో కడియం శ్రీహరికి కేసీఆర్ టిక్కెట్టు కేటాయించారు.