KVP Ramachandra Rao : సీఎం రేవంత్ రెడ్డికి కేవీపీ రామచంద్ర రావు లేఖ
తన ఫామ్ హౌజ్‌ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చేయాలని డిమాండ్ చేయడం ద్వారా మీ భుజంపై తుపాకీ పెట్టి నన్ను కాల్చాలని బీజేపి, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయి. కానీ నరనరాన కాంగ్రెస్ పార్టీ రక్తం ప్రవహిస్తున్న తాను పార్టీకి, అలాగే పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వానికి చెడ్డ పేరు రానివ్వకుండా తానే ముందుగా ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను అని కేవిపి స్పష్టంచేశారు.
- By Latha Suma Published Date - 03:55 PM, Fri - 4 October 24

KVP Ramachandra Rao letter to CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు నేడు బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్ శివార్లలోని అజీజ్ నగర్‌లో ఉన్న తన ఫామ్ హౌజ్ విషయంలో ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపి నేతలు చేస్తోన్న ఆరోపణలపై మరోసారి స్పష్టత ఇచ్చే ఉద్దేశంతోనే ఈ లేఖ రాస్తున్నాను అని కేవిపి రామచంద్రరావు ఆ లేఖలో పేర్కొన్నారు. తన ఫామ్ హౌజ్‌ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చేయాలని డిమాండ్ చేయడం ద్వారా మీ భుజంపై తుపాకీ పెట్టి నన్ను కాల్చాలని బీజేపి, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయి. కానీ నరనరాన కాంగ్రెస్ పార్టీ రక్తం ప్రవహిస్తున్న తాను పార్టీకి, అలాగే పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వానికి చెడ్డ పేరు రానివ్వకుండా తానే ముందుగా ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను అని కేవిపి స్పష్టంచేశారు.
Read Also: YCP Leaders Response: తిరుపతి లడ్డూపై సుప్రీం కోర్టు తీర్పు.. వైసీపీ నాయకుల స్పందన ఇదే!
ప్రతిపక్షాల విమర్శలకు తావులేకుండా ప్రభుత్వమే సంబంధిత అధికారులను పంపించి తన ఫామ్ హౌజ్ వద్ద పారదర్శకంగా సర్వే చేయించాల్సిందిగా కేవిపి విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఎఫ్టిఎల్ లేదా బఫర్ జోన్‌లో తన ఫామ్ హౌజ్ ఏ మాత్రం ఉన్నా.. ఆ భాగాన్ని తానే సొంత ఖర్చులతో కూల్చేయించి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి మరీ ఇస్తానని కేవీపీ తన లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఇందులో తాను ఎలాంటి మినహాయింపు కోరుకోను అని కేవీపీ తేల్చిచెప్పారు.
కాగా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి తొలిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజుల్లోనే మూసీ నది ప్రక్షాళనకు చేసిన ప్రయత్నాలను రేవంత్ రెడ్డికి రాసిన ఈ బహిరంగ లేఖలో కేవీపీ ప్రస్తావించారు. అలాగే ఏ కారణాల వల్ల మూసీ నది ప్రక్షాళన ముందడుగు పడలేదో కూడా కేవీపీ వివరించారు. ఎట్టకేలకు మీరు చేస్తోన్న ఈ ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా స్వాగతిస్తానని చెప్పే క్రమంలో కేవీపీ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. అలాగే బీజేపి, బీఆర్ఎస్ పార్టీలు చేస్తోన్న ఆరోపణలపైనా కేవీపీ కామెంట్ చేశారు.
ప్రతిపక్ష నాయకులు, మీడియాకు అనుమతినిచ్చి.. సరిహద్దులను గుర్తించాలని కోరారు. “మార్కింగ్ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇది బహిరంగంగా జరగనివ్వండి, ప్రతి ఒక్కరూ గమనించే అవకాశం ఇవ్వండి” అని కేవీపీ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత ప్రయత్నాలను స్వాగతించారు. “మీ నాయకత్వంలోని మూసీ క్లీనప్, బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్‌కు నేను పూర్తిగా మద్దతు ఇస్తున్నాను” అని లేఖలో పేర్కొన్నారు. మొదటి దశలో క్లీనప్‌ను పూర్తి చేసి, రెండో దశలో సుందరీకరణకు పనులు చేపట్టాలని కేవీపీ సూచించారు. నిబద్ధతతో కూడిన కాంగ్రెస్ కార్యకర్తగా.. పేదలకు నష్టం జరగకుండా.. ప్రభుత్వం చేపడుతున్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు తాను అండగా ఉంటానని కేవీపీ స్పష్టం చేశారు.
Read Also: CM Chandrababu : లడ్డూ వివాదం..సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన సీఎం చంద్రబాబు