Medaram: మేడారం జాతరకు అంకురార్పణ, గుడిమెలిగే పండుగతో జాతర తొలిఘట్టం
- Author : Balu J
Date : 07-02-2024 - 11:52 IST
Published By : Hashtagu Telugu Desk
Medaram: మేడారం మహాజాతరకు బుధవారం అంకురార్పణ జరిగింది. గుడిమెలిగే పండుగతో జాతర తొలిఘట్టం మొదలవుతుంది. మహా జాతరకు రెండు వారాల ముందు గుడిమెలిగే తంతు నిర్వహిస్తారు. పూజారుల కుటుంబాల ఇండ్ల శుద్ది కార్యక్రమం జరిగింది. తరువాత మేడారంలోని సమ్మక్క, కన్నేపల్లిలోని సారలమ్మ , కొండాయిలోని గోవిందరాజు, పూనుగొండ్లలోని పగిడిద్దరాజు ఆలయాలను ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం పూజారులు శుద్ది చేసారు. సమ్మక్క గద్దెను ఎర్రమట్టితో అలుకు చల్లి రంగుల ముగ్గులతో అలంకరణ చేసారు.
ఆసియా ఖండంలో అతిపెద్ద గిరిజన కుంభమేళాగా పిలిచేటువంటి మేడారం జాతరలో (Medaram Jatara) అమ్మవార్లకు ప్రసాదంగా బంగారాన్ని సమర్పిస్తారు. సాధారణంగా అన్ని ఆలయాల్లో పండ్లు రకరకాల ఆహార పదార్థాలు పానీయాలతో దేవుళ్లకు నైవేద్యంగా సమర్పిస్తారు కానీ ఈ మేడారంలోని సమ్మక్క-సారలమ్మలకు చీర, గాజులు, పసుపు కుంకుమలతో పాటు బంగారం నైవేద్యంగా సమర్పిస్తారు.
బంగారం అంటే నిజమైన బంగారం కాదు బెల్లం. పూర్వం లో మేడారం జాతరను కేవలం గిరిజనులు మాత్రమే జరుపుకునే వారు వారికి అందుబాటులో అప్పుడున్న ధరలతో పోల్చుకుంటే తక్కువ ధరలో లభ్యమయ్యే బెల్లాన్ని నైవేద్యంగా పెట్టడం ప్రారంభించారు. అనాదికాలంగా వస్తున్నటువంటి ఆచారసాంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. గిరిజనులతో పాటు తెలంగాణ ప్రాంతం మరియు ఇతర రాష్ట్రాల నుంచి కోట్ల సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవార్లకు ఈ బంగారాన్ని సమర్పించడం వారి కోరికలను అమ్మవారికి నివేదించుకోవడం అలవాయితీగా వస్తుంది.