YSRCP : వైఎస్సార్‌సీపీకి మరో షాక్.. మాజీ ఐఏఎస్ ఇంతియాజ్ గుడ్ బై
YSRCP : గత ఎన్నికల్లో కర్నూల్ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఇంతియాజ్.. ఓటమి పాలయ్యారు.. అయితే, ఇప్పుడు ఇంతియాజ్ రాజీనామా లేఖ విడుదల చేశారు..
- By Kavya Krishna Published Date - 08:05 PM, Fri - 27 December 24

YSRCP : ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఇలా పలువురు పార్టీని వీడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో షాక్ తగిలింది. వైసీపీకి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి, కర్నూలు నియోజకవర్గ నేత ఇంతియాజ్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కేవలం వైసీపీకి మాత్రమే కాదు, రాజకీయాలకు మొత్తం గుడ్‌బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు.
గత ఎన్నికల్లో కర్నూలు జిల్లా నుండి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఇంతియాజ్ ఓటమిపాలయ్యారు. అయితే, తాజాగా ఆయన రాజీనామా లేఖ విడుదల చేశారు. అందులో రాజకీయాలను విడిచిపెట్టే తన నిర్ణయాన్ని స్పష్టం చేశారు. లేఖలో పేర్కొన్న విషయాలను పరిశీలిస్తే, ఇంతియాజ్ రాజకీయాల కోసం కాదు, ప్రజాసేవ కోసం తన జీవితాన్ని అంకితం చేయాలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది.
ఇంతియాజ్ విడుదల చేసిన రాజీనామా లేఖ
“అందరికీ నమస్కారం. కొన్ని నెలల క్రితం ప్రజాసేవే ధ్యేయంగా, ముఖ్యంగా కర్నూలు నగరంలోని పేదల సేవ కోసం ఐఏఎస్ సర్వీస్ నుండి వీఆర్ఎస్ తీసుకొని రాజకీయాల్లోకి అడుగుపెట్టాను. కర్నూలు నియోజకవర్గం నుండి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం, ఆ ఎన్నికల ఫలితాలు మీ అందరికీ తెలిసిందే. అయితే, గత కొంతకాలంగా బంధుమిత్రులు, శ్రేయోభిలాషులతో చర్చించాక ఒక కీలక నిర్ణయం తీసుకున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను.
అయితే ప్రజాసేవ నుండి మాత్రం పక్కకు తప్పను. ఒక రిటైర్డ్ ఏఐఎస్ అధికారిగా, సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిగా, సాహితీవేత్తగా సమాజ అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తాను. ముఖ్యంగా సామాజిక అసమానతలు, పర్యావరణ కాలుష్య సమస్యలను రూపుమాపడానికి స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాను. గత ఆరు నెలల కాలంలో నాకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా కర్నూలు నగర వాసులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అని ఇంతియాజ్ పేర్కొన్నారు.
పార్టీకి రాజీనామా వెనుక నిజం?
ఇంతియాజ్ గతంలో ఐఏఎస్ అధికారి గా మంచి పేరు సంపాదించుకున్నారు. రాజకీయ రంగంలోకి వచ్చినప్పటికీ, ఆయనకు విజయాన్ని సాధించడం సాధ్యం కాలేదు. వైసీపీ నుంచి ఆయన రాజీనామా చేయడం గతంలో కొందరు నేతలు చేసినట్లుగానే రాజకీయ ప్రవర్తనలపై ప్రశ్నలను కలిగిస్తోంది.
ఇంతియాజ్ నిజంగా రాజకీయాలకు దూరంగా ఉంటారా? లేక కొంతకాలం తర్వాత కూటమి పార్టీలలో చేరతారా అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. ఇప్పటివరకు ఇచ్చిన ప్రకటనల మేరకు, ఆయన తన సమయాన్ని ప్రజాసేవ, పర్యావరణ సమస్యల పరిష్కారానికి కేటాయించనున్నారు. మరి ఈ నిర్ణయంతో ఆయన భవిష్యత్తు ఏ మార్గంలో నడుస్తుందో వేచిచూడాల్సి ఉంది.
Follow-On: భారత జట్టుకు ఫాలో ఆన్ ముప్పు.. ఇంకా ఎన్ని పరుగులు చేయాలంటే?