Loan App: నేపాల్ కేంద్రంగా లోన్ యాప్స్ దందా!
భారీ వడ్డీలతో .. ఫోన్ కాల్ వేధింపులతో దేశంలో ఎంతోమంది ఉసురుతీసిన లోన్ యాప్ లు రూటు మార్చ లేదు.
- By Hashtag U Published Date - 02:01 PM, Tue - 26 April 22
భారీ వడ్డీలతో .. ఫోన్ కాల్ వేధింపులతో దేశంలో ఎంతోమంది ఉసురుతీసిన లోన్ యాప్ లు రూటు మార్చ లేదు. కానీ ఐపీ అడ్రస్ మాత్రం మార్చాయి. ఔను.. చాలా లోన్ యాప్ లు ఇప్పుడు వాటి సర్వర్ అడ్రెస్ లను నేపాల్, ఫిలిప్పిన్స్ దేశాలకు మార్చాయని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. ఇటీవల హైదరాబాద్ పరిధిలో నమోదైన పలు లోన్ యాప్ కేసులను విచారించగా ఈవిషయం వెలుగులోకి వచ్చింది. 2021 చివర్లో కొంత కామ్ అయిపోయిన లోన్ యాప్ లు.. మళ్లీ కొత్తకొత్త పేర్లతో గూగుల్ ప్లే స్టోర్ వేదికగా దందాను మొదలు పెట్టాయి.
“Rupee tiger” లోన్ యాప్ దోపిడీ..
ఉదాహరణకు పరిశీలిస్తే.. గూగుల్ ప్లే స్టోర్ లో “Rupee tiger” అనే ఒక యాప్ ఉంది. అది డౌన్ లోడ్ చేసిన వాళ్ళు లోన్ వడ్డీ రేటు ఎంతో తెలుసుకునేందుకు తమ బ్యాంకు అకౌంటు, ఫోన్ నంబర్ సహా పూర్తి వివరాలు సమర్పిస్తున్నారు. అయితే ఆ తర్వాత లోన్ ఆఫర్ కు అంగీకారం తెలుపకముందే అకౌంట్ లో డబ్బులు వేస్తున్నారు. అత్యంత భారీ వడ్డీ రేటు ఉన్న ఆ లోన్ ను.. తన ఖాతాలో వేయడాన్ని చూసి వినియోగదారులు లబోదిబోమంటున్నారు. ఈ లోన్ యాప్ లో రూ.6000 లోన్ కుగానూ మంజూరు చేసేది కేవలం రూ.3300. మిగితా రూ.2,700 ప్రాసెసింగ్ ఫీజుగా వసూలు చేస్తున్నారు. ఇంత గలీజు దోపిడీకి పాల్పడుతున్న యాప్ కు Nbfc సంస్థగా “Krazybee Services Private Limited” వ్యవహరిస్తోంది. ఇటువంటి యాప్ లను తొలగించకపోవడంతో గూగుల్ ప్లే స్టోర్ విశ్వసనీయత కూడా ప్రశ్నార్ధకంగా మారుతోందని ప్రజలు అంటున్నారు. ఇటువంటి లోన్ యాప్ లపై ఫిర్యాదుల స్వీకరణకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (Rbi) ప్రారంభించిన “sachet.rbi.org.in” పోర్టల్ కూడా సాంకేతిక కారణాలతో సరిగ్గా పనిచేయడం లేదని బాధితులు చెబుతున్నారు. ఈ పోర్టల్ సరిగ్గా పనిచేసేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
బెంగళూరు లో కాల్ సెంటర్లు..
ఇప్పుడు లోన్ యాప్స్ కాల్ సెంటర్లు బెంగళూరు కేంద్రం గా చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలో లోన్ యాప్స్ కాల్ సెంటర్లు నడుపుతున్న ఇద్దరిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. భారీ వడ్డీకి షార్ట్ టర్మ్ లోన్స్ ఇస్తున్న వ్యవహారం తో ముడిపడిన దాదాపు 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. లోన్ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకున్న వారి కాంటాక్ట్ లిస్ట్ ను ఈ కంపెనీలు తీసుకుంటాయి.భవిష్యత్ లో లోన్ కట్టకుంటే.. ఆ కాంటాక్ట్ లిస్టులో ఉన్న నంబర్లకు ఇతడు లోన్ డ్యూ ఉన్నాడంటూ మెసేజ్ లు పంపుతారు. ఈ బెదిరింపుల వల్లే ఎంతోమంది గత ఏడాది ఆత్మహత్యలు చేసుకున్నారు. మళ్లీ అలా జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి వేధించే లోన్ యాప్స్ కు దూరంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Related News
Allu Arjun Pushpa 2 : ఆ సినిమా కోసం మలేషియాని హైదరాబాద్ కి తెచ్చేశారు..!
Allu Arjun Pushpa 2 సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న పుష్ప 2 సినిమా పార్ట్ 1 కన్నా భారీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.