Gujarat: బహుభార్యత్వం ప్రోత్సహించాల్సినది కాదు: గుజరాత్ హైకోర్టు
- By hashtagu Published Date - 01:19 PM, Fri - 31 December 21

ఓ ముస్లిం మహిళ వేసిన పిటిషన్ కు సంబంధించిన కేసుపై తీర్పు ఇస్తూ గుజరాత్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళను భర్తతో కాపురానికి బలవంతం చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ముస్లిం చట్టం బహుభార్యత్వం అనుమతించినా కానీ.. భర్తతో కలసి జీవించబోనని తిరస్కరించే హక్కు భార్యకు ఉంటుందని స్పష్టం చేసింది. తన భర్త వేరే మహిళను పెళ్లి చేసుకున్న నేపథ్యంలో భార్య
భర్త నుండి విడాకులు కోరుతూ హై కోర్టు కేసు నమోదు చేసింది.
భారత్ లో అమల్లో ఉన్న ముస్లిం పర్సనల్ లా.. బహుభార్యత్వాన్ని ఒక ఆచారంగానే పరిగణిస్తోంది తప్ప అది ప్రోత్సహించాల్సినది కాదు. తన భార్యకు ఇష్టం లేకుండా మరో మహిళతో కలసి వైవాహిక జీవితం పంచుకోవాలని కోరే ప్రాథమిక హక్కు భర్తకు లేదు అని గుజరాత్ హైకోర్టు తీర్పు చెప్పింది. 2021 జూలైలో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ.. ఆ మహిళ హైకోర్టుకు వెళ్ళింది. భర్త ఇంటికి వెళ్లి కాపురం చేసుకోవాలంటూ ఫ్యామిలీ కోర్టు ఆమెను ఆదేశించడం గమనార్హం. ‘‘ఏ వ్యక్తి కూడా ఒక మహిళ లేదా తన భార్యతో సహజీవనం చేయడం ద్వారా దాంపత్య హక్కులను సొంతం చేసుకోలేడు’’ అని హై కోర్టు పేర్కొంది.