Formula-E car race : కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే వివిధ్వంసాలకు బిఆర్ఎస్ కుట్ర: ఆది శ్రీనివాస్
ఈ అల్లర్ల కోసం ఒక్కో నియోజకవర్గానికి కోటి రూపాయలు చొప్పున మొత్తం వంద కోట్లు ఖర్చు పెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్దమైనట్లు ప్రభుత్వానికి సమాచారం ఉందని ఆయన అన్నారు.
- By Latha Suma Published Date - 04:08 PM, Fri - 20 December 24

Formula-E car race : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఫార్ములా-ఈ కార్ రేసులో అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో విధ్వంసం సృష్టించేందుకు బీఆర్‌ఎస్ కుట్ర పన్నుతోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కేటీఆర్‌ను అరెస్ట్ చేయగానే ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, దాడులకు కుట్ర జరుగుతోంది. కేటీఆర్ ఆత్మ, బినామీ తేలుకుంట్ల శ్రీధర్ కుట్ర చేస్తున్నారు. ఈ అల్లర్ల కోసం ఒక్కో నియోజకవర్గానికి కోటి రూపాయలు చొప్పున మొత్తం వంద కోట్లు ఖర్చు పెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్దమైనట్లు ప్రభుత్వానికి సమాచారం ఉందని ఆయన అన్నారు.
ఎక్కడికక్కడ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు, ఆర్టీసీ బస్సులపై దాడులు చేస్తూ రాష్ట్రంలో పెను విధ్వంసం సృష్టించేందుకు కుట్ర చేస్తున్నట్లు ప్రభుత్వం వద్ద సమాచారం ఉందనిఆది శ్రీనివాస్ అన్నారు. బావ కళ్లలో ఆనందం కోసం హరీష్ రావు అసెంబ్లీలో అడ్డగోలుగా వ్యవహారిస్తున్నాడని వ్యాఖ్యానించారు. కేటీఆర్ ను ఏ 1 గా ఎఫ్ ఐఆర్ నమోదు అయ్యాక అసెంబ్లీ లో చర్చ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. లగచర్ల ఘటన లాగా మరోసారి కేటీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ కుట్రలకు మేము భయపడేది లేదని, దొంగే దొంగ అన్నట్లు గా కేటీఆర్ తీరు ఉందని విమర్శించారు. ధరణి పైన చర్చ జరిగితే తమ భూఆక్రమాలు బయట పడుతాయనే చర్చను అడ్డుకుంటున్నారని ఆది శ్రీనివాస్ అన్నారు.
కాగా, జైలుకి వెళ్ళేందుకు భయపడేదేలే.. అని చెప్పిన కేటీఆర్, ఏసీబీ కేసు వేసిందని సమాచారం అందగానే, ఈరోజు హైకోర్టులో లంచ్ మోషన్ (క్వాష్) పిటిషన్ వేశారు. తనపై నమోదు చేసిన ఈ కేసుని కొట్టివేయాలని కేటీఆర్ కోరారు. ఈరోజు భోజన విరామం తర్వాత హైకోర్టు కేటీఆర్ పిటిషన్‌పై విచారణ జరుపనుంది. అయితే ఈ వ్యవహారంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ఏసీబీ కేటీఆర్ తదితరులపై కేసు నమోదు చేసినందున దానిపై విచారణ జరుపకుండా హైకోర్టు కేసు కొట్టేయదు కానీ కేటీఆర్ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేసే అవకాశం ఉంటుంది. కేటీఆర్‌పై నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం.
Read Also: Marriage: స్త్రీలు వారి కంటే పెద్ద వయసు వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకోవాలో తెలుసా?