Food Poisoning: చాట్ తిని 100 మందికి పైగా అస్వస్థత
జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్‌బాద్‌లో జరిగిన జాతరలో చాట్ తిని 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ఎక్కువగా పిల్లలు ఉన్నారు
- Author : Praveen Aluthuru
Date : 20-04-2023 - 1:47 IST
Published By : Hashtagu Telugu Desk
Food Poisoning: జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్‌బాద్‌లో జరిగిన జాతరలో చాట్ తిని 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ఎక్కువగా పిల్లలు ఉన్నారు. ఈ ఘటన బుధవారం రాత్రి 10:30 గంటలకు చోటుచేసుకుంది. అనంతరం అస్వస్థతకు గురైన వారందరినీ ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఎక్కువమంది చిన్నారులు వాంతులు చేసుకోవడంతో నీరసించిపోయారు. తద్వారా శరీరంలో నీటి కొరత ఎర్పడింది. దీంతో వెంటనే అందరికీ సెలైన్ అందించారు. బాధాకరం ఏంటంటే.. సెలైన్ అందించేందుకు స్టాండ్ లేకపోవడంతో బంధువులు సెలైన్ చేత పట్టుకున్న పరిస్థితి.
అస్వస్థకు గురైన వారిలో 30 మంది జేపీ ఆసుపత్రిలో, 70 మంది ఎస్‌ఎన్‌ఎంఎంసిహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఇంత మంది రోగులు ఒక్కసారిగా ఆస్పత్రికి రావడంతో బెడ్ల కొరత ఏర్పడింది. దాదాపు 100 మంది ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. విషయం తెలుసుకున్న డిప్యూటీ కమిషనర్ తన ఆదేశాల మేరకు బలియాపూర్ సీఓ రాంప్రవేష్ ఆస్పత్రికి వచ్చారు. బంధువులతో మాట్లాడారు. అస్వస్థతకు గురైన వారి వివరాలను వైద్యుల నుంచి సేకరించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. దీనిపై విచారణకు కూడా అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు కూడా ఆసుపత్రికి చేరుకుని రోగులు మరియు వారి బంధువుల నుండి సంఘటన గురించి సమాచారం తీసుకున్నారు.