Gang War: బీహార్‌లో గ్యాంగ్‌వార్ కలకలం.. ఐదుగురు మృతి..?
బీహార్‌లోని కతిహార్‌లో గ్యాంగ్‌వార్ ఘటన చోటుచేసుకుంది.
- Author : Gopichand
Date : 03-12-2022 - 10:14 IST
Published By : Hashtagu Telugu Desk
బీహార్‌లోని కతిహార్‌లో గ్యాంగ్‌వార్ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మరణించినట్లు తెలుస్తోంది. పోలీసులు ఒక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మరణాల సంఖ్య ఇంకా అధికారికంగా ధృవీకరించబడనప్పటికీ ఈ ఘటనతో ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. ఈ మొత్తం వ్యవహారం కతిహార్ జిల్లాలోని బరారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బకియా దియారాలో జరిగింది.
రెండు గ్రూపులు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఇందులో రెండు గ్యాంగ్‌లకు చెందిన ఐదు నుంచి ఆరుగురు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. దియారా ప్రాంతంలో ఆధిపత్యం కోసం బకియా దియారా ప్రాంతంలో మోహనా ఠాకూర్, సునీల్ యాదవ్ మధ్య చాలా కాలంగా గ్యాంగ్ వార్ నడుస్తోందని చెబుతున్నారు స్థానిక ప్రజలు. గతంలో కూడా దియారా ప్రాంతంలో ఇలాంటి ఘటనలు చాలాసార్లు జరిగాయి. ఇక్కడ కాల్పుల ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇదేమీ కొత్త విషయం కాదు. ఇలాంటి ఘటనలు ఇక్కడ నిత్యం జరుగుతూనే ఉన్నాయి.
ఈ ఘటన తర్వాత ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. పోలీసులు స్వాధీనం చేసుకున్న మృతదేహం సునీల్ యాదవ్ గ్యాంగ్‌కు చెందిన అరవింద్ యాదవ్‌ది. అతని మరణాన్ని ఎస్పీ జితేంద్ర కుమార్ ధృవీకరించారు. ఈ రెండు ముఠాలు భాగల్‌పూర్ జిల్లాలోని బఖర్‌పూర్, కతిహార్‌లోని బరారీ, జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్‌కు ఆనుకుని ఉన్న దియారా ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు సమాచారం. అయితే.. గ్యాంగ్ వార్‌లో కనీసం ఐదుగురు మరణించారని, వారి మృతదేహాలను ఇంకా స్వాధీనం చేసుకోలేదని గ్రామస్థులు స్థానిక మీడియాకు తెలిపారు. మోహన్ ఠాకూర్, సునీల్ యాదవ్ గ్యాంగ్‌ల మధ్య గ్యాంగ్ వార్ జరిగిందని గ్రామస్థులు పేర్కొన్నారు.