Ram Lalla Darshan : ప్రాణ ప్రతిష్ఠ తర్వాత రామ్‌లల్లా తొలి దర్శనమిదే..
Ram Lalla Darshan : రామభక్తుల సుదీర్ఘ నిరీక్షణ నెరవేరింది. ఎంతోమంది పోరాటం యొక్క ఫలితం రామజన్మభూమిలో ప్రతిబింబించింది.
- Author : Pasha
Date : 22-01-2024 - 12:53 IST
Published By : Hashtagu Telugu Desk
Ram Lalla Darshan : రామభక్తుల సుదీర్ఘ నిరీక్షణ నెరవేరింది. ఎంతోమంది పోరాటం యొక్క ఫలితం రామజన్మభూమిలో ప్రతిబింబించింది. 500 ఏళ్ల కల చివరకు నిజమై కళ్లెదుట సాక్షాత్కారమైంది. నవ్య భవ్య అయోధ్య రామమందిరంలోని గర్భగుడిలో భగవాన్ శ్రీరామచంద్రుడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని మోడీ సమక్షంలో దీనికి సంబంధించిన ప్రత్యేక పూజలు జరిగాయి. ఎడమచేతిలో విల్లు, కుడిచేతిలో బాణంతో స్వర్ణాభరణాలు ధరించి చిరు దరహాసం, ప్రసన్నవదనంతో బాలరాముడు (Ram Lalla Darshan) దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో టీవీల్లో వీక్షించారు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రధాని మోడీ వెంట ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ తదితరులు ఉన్నారు. ఇవాళ సరిగ్గా మధ్యాహ్నం 12:29 గంటలకు అభిజిత్ ముహూర్తంలో ప్రధాని నరేంద్ర మోడీ రామమందిరం గర్భగుడిలో రాముడికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. సరిగ్గా 12:29:08 నుంచి 12:30:32 సెకన్ల వరకూ నిర్ణయించిన ప్రాణప్రతిష్ఠ ముహూర్తంలో క్రతువును పూర్తిచేశారు. అభిజిత్ లగ్నంలో 84 సెకన్ల దివ్యముహూర్తంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. రామ్‌లలా విగ్రహం కళ్లకు ఉన్న వస్త్రాన్ని తొలగించాక.. బంగారంతో చేసిన కడ్డీతో శ్రీరాముడికి కాటుకను దిద్దారు. ప్రాణప్రతిష్ఠ తర్వాత 108 దీపాలతో బాలరాముడికి హారతినిచ్చారు. రామయ్య ప్రాణప్రతిష్ఠకు 7 వేల మంది అతిథులు.. లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో అయోధ్యానగరి భక్తజనంతో కిక్కిరిసింది. 1:15 గంటల తర్వాత దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు.
Also Read: Arun Yogiraj : తొలిసారి మాట్లాడిన రామయ్య విగ్రహ శిల్పి అరుణ్ యోగిరాజ్ .. ఏమన్నారు?
హెలికాప్టర్లతో పూలవర్షం
ప్రాణప్రతిష్ఠ సమయంలో గగనవీధుల నుంచి ఆలయంపై హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించారు. ప్రాణప్రతిష్ఠకు ముందు పుజాసామాగ్రితో ఆలయంలోకి ప్రవేశిస్తోన్న వీడియోను ప్రధాని మోడీ ట్విట్టర్(ఎక్స్)లో షేర్ చేశారు. ‘ఈ దివ్యవేడుకలో భాగమైనందుకు నాకు అంతులేని ఆనందంగా ఉంది’ అని ఆయనకు భావోద్వేగానికి గురయ్యారు. ఈ కార్యక్రమంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు, సినీ, క్రీడా ప్రముఖులు రజనీకాంత్, చిరంజీవి దంపతులు, రామ్ చరణ్, అమితాబ్‌బచ్చన్, విక్కీ కౌశల్, అభిషేక్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, కత్రినా కైఫ్, అనుపమ్ ఖేర్, రాజ్‌కుమార్ హిరానీ, రిషభ్ శెట్టి, సచిన్ తెందూల్కర్, అనిల్ కుంబ్లే, సైనా నెహ్వాల్, మిథాలీ రాజ్, పారిశ్రామికవేత్తలు ముకేశ్ అంబానీ దంపతులు, కుమార మంగళం బిర్లా, అనన్య బిర్లా, అనిల్ అంబానీ, ఆకాశ్, శ్లోకా, ఈశా అంబానీ, ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్, యోగా గురువు రాందేవ్ బాబా తదితరులు పాల్గొన్నారు. ఇక అయోధ్యా నగరమంతా రామ్ లీల, భగవద్గీత కథలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.