Telangana: ఉక్రెయిన్ నుండి హైదరాబాద్‌కు చేరుకున్న.. 15 మంది తెలంగాణ విద్యార్ధులు..!
- By HashtagU Desk Published Date - 03:27 PM, Sun - 27 February 22

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్ధులు క్రమంగా స్వదేశానికి చేరుకుంటున్నారు. ఈక్రమంలో 218 మందితో బుకారెస్ట్ నుండి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం శనివారం రాత్రి ఇండియాకు చేరుకుంది. ఉక్రయిన్ నుండి స్వదేశానికి వచ్చిన ఈ తొలిబ్యాచ్‌లో 15 మంది తెలంగాణ విద్యార్ధులు ఉన్నారు. ఈ నేపధ్యంలో ఈరోజు ముంబై నుండి హైదరాబాద్‌కు చేరుకున్న విద్యార్ధులను, వారి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యలు రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో రిసీవ్ చేసుకున్నారు. ఇక హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వ అధికారులు స్వాగతం పలికారు.
విద్యార్థులకు స్వాగతం పలికిన వారిలో సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఉన్నారు. ఈ క్రమంలో తమను సురక్షితంగా తరలించినందుకు భారత ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.రొమేనియాకు వెళ్లేందుకు సరిహద్దు దాటి అక్కడి నుంచి విమానం ఎక్కినట్లు చెప్పారు. విద్యార్థులు తిరిగి రావడానికి భారత రాయబార కార్యాలయం మరియు తమ విశ్వవిద్యాలయాల అధికారులు అన్ని సహాయ సహకారాలు అందించారని చెప్పారు. తమ స్నేహితులు చాలామంది అక్కడ ఒంటరిగా ఉన్నారని విద్యార్థులు తెలిపారు. కొందరు ఇప్పటికీ హాస్టళ్లలో ఉండగా మరికొందరు బంకర్లలో ఉన్నారని తెలిపారు. 70 వేల నుంచి 90 వేల వరకు అధిక ప్రయాణ ఛార్జీలు ఉండడంతో చాలా మంది విద్యార్థులు తిరిగి రాలేకపోతున్నారని మరో విద్యార్థి తెలిపారు. ఇకపోతే న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లోని అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, రాష్ట్రం నుండి ఇప్పటి వరకు మొత్తం 23 మంది విద్యార్థులు భారతదేశానికి తిరిగి వచ్చారని, మరికొంత మంది విద్యార్థులు ఈరోజే హైదరాబాద్ చేరుకోనున్నారని అధికారులు వెల్లడించారు.