RCB Beats LSG: డుప్లెసిస్ కెప్టెన్ ఇన్నింగ్స్.. బెంగళూరు గెలుపు
ఐపీఎల్ 15వ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో విజయాన్ని అందుకుంది. ఆసక్తికరంగా సాగిన పోరులో లక్నో సూపర్ జెయింట్స్ పై విజయం సాధించింది.
- By Naresh Kumar Published Date - 11:36 PM, Tue - 19 April 22

ఐపీఎల్ 15వ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో విజయాన్ని అందుకుంది. ఆసక్తికరంగా సాగిన పోరులో లక్నో సూపర్ జెయింట్స్ పై విజయం సాధించింది. డుప్లెసిస్ కెప్టెన్ ఇన్నింగ్స్ కు తోడు హ్యాజిల్ వుడ్ బౌలింగ్ తోడవడంతో ఆర్ సీబీ ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
మొదట బ్యాటింగ్ కు దిగిన బెంగళూరుకు తొలి ఓవర్లనో దిమ్మతిరిగే షాక్ తగిలింది.దుష్మంత్ చమీరా వేసిన తొలి ఓవర్‌లో అనూజ్ రావత్(4), విరాట్ కోహ్లీ వరుస బంతుల్లో పెవిలియన్ చేరారు. దాంతో 7 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఆర్‌సీబీని క్రీజులోకి వచ్చిన మ్యాక్స్‌వెల్‌తో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ గాడిన పెట్టే ప్రయత్నం చేసాడు. మ్యాక్స్‌వెల్‌ను కృనాల్ పెవిలియన్ చేర్చడంతో పవర్ ప్లేలో ఆర్‌సీబీ 3 వికెట్ల నష్టానికి 47 రన్స్ చేసింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా షాబాజ్ అహ్మద్ తో కలిసి ఇన్నింగ్స్ నిలబెట్టాడు. 40 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న డుప్లెసిస్ చివరి ఓవర్ వరకూ క్రీజులో ఉండి జట్టుకు మంచి స్కోర్ అందించాడు. చివర్లో భారీ షాట్లతో చెలరేగిన ఫాఫ్ 4 పరుగుల తేడాలో సెంచరీ చేజార్చుకున్నాడు. దీంతో బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 181 పరుగులు చేసింది. డుప్లెసిస్ 64 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 96 రన్స్ చేశాడు. లక్నో బౌలర్లలో దుష్మంత్ చమీరా, జాసన్ హోల్డర్ రెండేసి వికెట్లు తీయగా.. కృనాల్ పాండ్యా ఓ వికెట్ పడగొట్టాడు
182 పరుగుల ఛేదనలో లక్నో ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది. డికాక్ , మనీశ్ పాండే త్వరగానే ఔటవగా.. కెఎల్ రాహుల్, కృనాల్ పాండ్యా ఇన్నింగ్స్ నిలిపే ప్రయత్నం చేశారు. రాహుల్ 30 రన్స్ కు ఔటయ్యాక.. కృనాల్ గేర్ మార్చినా ఫలితం లేకపోయింది. సహచరుల నుంచి సప్రోట్ లేకపోవడంతో కృనాల్ కూడా 42 రన్స్ కు వెనుదిరిగాడు. మిగిలిన బ్యాటర్లలో అంచనాలు పెట్టుకున్న బదౌనీ, స్టోయినిస్ లు నిరాశపరిచారు. బెంగళూరు బౌలర్లు వీరికి క్రీజులో నిలదొక్కుకునే అవకాశం ఇవ్వలేదు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ 18 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఆర్ సీబీ బౌలర్లలో హ్యాజిల్ వుడ్ 4 వికెట్లతో అదరగొట్టాడు.హర్షల్ పటేల్ 2 , సిరాజ్ , మాక్స్ వెల్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ సీజన్ లో బెంగళూరుకు ఇది ఐదో విజయం. అటు లక్నోకు ఇది మూడో ఓటమి. కాగా తాజా విజయంతో బెంగళూరు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్ళింది.
Pic Courtesy- RCB/Twitter
3️⃣ runs and a wicket in the 1️⃣9️⃣th over. 🔥🔥
What. A. Spell. 🤜🏻🤛🏻#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB #LSGvRCB pic.twitter.com/MinVVHnxBf
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 19, 2022