Dhoni Retirement: ధోనీ రిటైర్మెంట్ పై గవాస్కర్ వ్యాఖ్యలు
ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ధోనీ .. ఇక ఐపీఎల్ నుంచి కూడా వైదొలుగుతాడా ?
- Author : Hashtag U
Date : 13-05-2022 - 1:18 IST
Published By : Hashtagu Telugu Desk
ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ధోనీ .. ఇక ఐపీఎల్ నుంచి కూడా వైదొలుగుతాడా ? 2023 ఐపీఎల్ లో ఆడడా ? అనే ప్రశ్నలు క్రికెట్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో భారత జట్టు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ దీనికి సమాధానం ధోనీ ఎక్కువగా వాడే definitely not (కానే కాదు) అనే పదమే’ అని ఆయన స్టార్ స్పోర్ట్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపారు. గురువారం ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ధోనీ సారధ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఘోరంగా ఓడిపోయింది. దీంతో కనీసం ప్లే ఆఫ్ కు అర్హత సాధించకుండానే ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ ఇంటిముఖం పట్టింది.
‘ ఈ మ్యాచ్ లో ధోనీ 36 పరుగులు చేసి నాటౌట్ గా నిలవడం అతడి ఫామ్ కు నిదర్శనం. మొత్తం 20 ఓవర్లు క్రీజ్ లోనే ఉండటం గొప్ప విషయం. మైదానం నలువైపులా యాక్టివ్ గా పరుగులు తీస్తుండటం ధోనీ స్టెమినా, ఫిట్ నెస్ లెవల్ ను అద్దం పడుతుంది. క్రికెట్ పై ధోనీకి ఇంకా ఆసక్తి ఉంది అనేందుకు ఇవే నిదర్శనాలు. చెన్నై సూపర్ కింగ్స్ తొలి 2 లేదా 3 వికెట్లు పడిపోయిన ప్రతిసారి ధోనీ బ్యాట్ తో ఆదుకుంటున్నాడు. అతడు తప్పకుండా ఎల్లో జెర్సీ తో వచ్చే ఐపీఎల్ లోనూ కనిపిస్తాడని నేను భావిస్తున్నా.’ అని గవాస్కర్ కామెంట్ చేశారు. ‘2020 ఐపీఎల్ సీజన్ ముగిసే సమయంలో ధోనీని మీడియా ఇదే విషయమై ప్రశ్న అడిగితే.. అతడు definitely not అని బదులిచ్చాడు. ఇప్పుడు కూడా అదే సమాధానం పునరావృతం అవుతుందని నేను భావిస్తున్నా’ అని గవాస్కర్ అభిప్రాయపడ్డారు.