3 Lakhs Cases: దేశంలో కరోనా కల్లోలం.. ఒక్కరోజే 3 లక్షల కేసులు!
దేశంలో కరోనా మహమ్మారి మరింత తీవ్రరూపం దాల్చింది. కొత్త కేసులు భారీగా పెరిగి, మూడు లక్షల మార్కును దాటేశాయి.
- By Balu J Published Date - 11:45 AM, Thu - 20 January 22

దేశంలో కరోనా మహమ్మారి మరింత తీవ్రరూపం దాల్చింది. కొత్త కేసులు భారీగా పెరిగి, మూడు లక్షల మార్కును దాటేశాయి. తాజాగా 19 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 3,17,532 మంది వైరస్ బారినపడ్డారు. పాజిటివిటీ రేటు 15శాతం నుంచి 16.41 శాతానికి పెరిగి ఆందోళన కలిగిస్తోంది. 24 గంటల వ్యవధిలో 491 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకూ 3.82 కోట్ల మందికి కరోనా సోకగా.. 4,87,693 మంది మహమ్మారికి బలయ్యారు. కాగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తాజా ఉద్ధృతికి దోహదం చేస్తోంది. ప్రస్తుతం ఆ వేరియంట్ కేసులు 9,287కి చేరాయి
159 కోట్లకుపై డోసుల పంపిణీ
దేశంలో టీకా కార్యక్రమం నిర్విరామంగా సాగుతోంది. ఇప్పటివరకు 159 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న ఒక్కరోజే 73.3లక్షల మంది టీకా తీసుకున్నారు. 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు వారిలో 3.84 కోట్ల మందికి తొలి డోసు పూర్తయ్యింది. ఆ వయసు వారిలో 50 శాతం మందికి పైగా మొదటి డోసు తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. అలాగే 61,75,049 ప్రికాషనరీ డోసులు వేసినట్లు వెల్లడించింది.
తెలంగాణలో 3,557 కొత్త కేసులు
తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజువారీ కేసులు నాలుగువేల దిశగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,178 శాంపిల్స్ పరీక్షించగా, 3,557 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక కరోనాతో మరో ముగ్గురు మృతి చెందారు. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ తన హైల్త్ బులెటిన్‌లో తెలిపింది. అటు కరోనా నుంచి 1,773 మంది కోలుకోగా, రివకరీ రేటు 96.06 శాతానికి చేరుకుంది. తెలంగాణలో ప్రస్తుతం 24, 253 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇవాళ 1,474 కేసులు నమోదయ్యాయి.
ఏపీలో..
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. రోజువారీ కొత్త కేసుల సంఖ్య 10వేలు దాటింది. ఈ స్థాయిలో కొత్త కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. యాక్టివ్ కేసులు కూడా 44,935 ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 41,713 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 10,057 మందికి సోకినట్లు నిర్ధారణ అయింది. అత్యధికంగా విశాఖపట్టణం జిల్లాలో 1827 మందికి ఆ తర్వాత చిత్తూరు జిల్లాలో 1822 మందికి, అతి తక్కువగా కృష్ణా జిల్లాలో 332 మందికి కరోనా నిర్ధారణ అయింది.