America: కరోనా కేసులతో అమెరికా విలవిల..
- By hashtagu Published Date - 03:05 PM, Fri - 31 December 21

కరోనావైరస్ ధాటికి అగ్రదేశం అమెరికా వణికిపోతోంది. కొత్త వేరియంట్ రాకతో అక్కడ రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా దాదాపు 5.8 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. రానున్న వారాల్లో ఒమిక్రాన్ తుపాను దేశాన్ని ముంచెత్తనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలో అగ్రదేశంలో చిన్నారులు రికార్డు స్థాయిలో ఆసుపత్రుల్లో చేరుతుండటం కలవరపెడుతోంది.
ఇప్పుడు మనకు నివారించే మార్గాలున్నాయి అని వైద్యులు అభిప్రాయపడ్డారు. చిన్నారులకు టీకాలు అందించాల్సిన ఆవశ్యకతను నిపుణులు గుర్తుచేస్తున్నారు. డిసెంబర్ 22 నుంచి 28 వరకు ముగిసిన వారంలో రోజుకు సగటున 378 మంది పిల్లలు ఆసుపత్రిలో చేరినట్లు గణాంకాలు వెల్లడించాయి. వారంతా 17 సంవత్సరాలు లేక ఆ కిందివయస్సు వారే. ఈ పెరుగుదల గత వారంతో పోల్చితే 66 శాతం అధికం కావడం గమనార్హం. అన్ని వయస్సుల వారు రోజుకు సగటున 10,200 మంది ఆసుపత్రిలో చేరారు. అలాగే చిన్నారుల్లో లక్షణాలు కూడా తక్కువగానే ఉంటున్నట్లు వైద్యులు చెప్తున్నారు.
అమెరికా సహా పలు దేశాలను ఇప్పటికే ఓమిక్రాన్ పట్టిపీడిస్తోంది. కానీ భారత ప్రభుత్వం పశ్చిమ దేశాల పరిస్థితులను చూసి కూడా జాగ్రత్తలు చేపట్టడం లేదు. పైగా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేల ప్రధాన మంత్రి తో సహా అధికారులు ఎన్నికలపై దృష్టి పెట్టారు. పరిస్థితులు చూస్తుంటే దేశం లో మూడో వేవ్ తప్పేటట్టు లేదు. నాయకులను, ప్రభుత్వాలను నమ్మేబదులు ప్రజలు కరోనా భారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. న్యూ ఇయర్, సంక్రాంతి వేడుకలను బహిష్కరిస్తే మంచిది.