NCERT: బుక్స్ నుంచి మా పేర్లు తీసేయండి.. ఎన్సీఈఆర్టీకి 33 మంది నిపుణుల లేఖ
33 మంది పొలిటికల్ సైన్స్ నిపుణులు పాఠ్యపుస్తకాల నుంచి తమ పేర్లను తీసేయాలంటూ నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT)కి సంచలన లేఖ రాశారు.
- By Pasha Published Date - 04:50 PM, Thu - 15 June 23

NCERT : 33 మంది పొలిటికల్ సైన్స్ నిపుణులు పాఠ్యపుస్తకాల నుంచి తమ పేర్లను తీసేయాలంటూ నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT)కి సంచలన లేఖ రాశారు. ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్ డెవలప్‌మెంట్ కమిటీలో వివిధ దశల్లో భాగస్వాములుగా ఉన్న ఈ మేధావులు సిలబస్ లో ఏకపక్ష మార్పులకు నిరసనగా పాఠ్యపుస్తకాల నుంచి తమ పేర్లను తొలగించాలని కోరారు. ఈ 33 మంది నిపుణులు పొలిటికల్ సైన్స్ కు సంబంధించి అద్భుతమైన పాఠ్యపుస్తకాలను తయారు చేశారు. అయితే ఎన్సీఈఆర్టీ వాటిలో కీలకమైన మార్పులు, తొలగింపులు చేయడం వారికి నచ్చలేదు. ఎన్సీఈఆర్టీ తాజాగా చేసిన మార్పుల తర్వాత.. ఆ బుక్స్ తాము తయారు చేసిన వాటిలా కనిపించడం లేదని, వాటిలో తమ పేర్లను చూసుకోవడం కష్టంగా ఉందని లేఖలో నిపుణులు అభిప్రాయపడ్డారు. “పాఠ్యపుస్తకాల్లో ఏది అవసరం .. ఏది అనవసరం అనేది నిర్ణయిస్తున్నది ఎవరో అనుమానాస్పదంగా ఉంది” అని నిపుణులు ఆరోపించారు. ఎన్సీఈఆర్టీ నిర్ణయాల్లో పారదర్శకత లోపించిందని, విద్యా విషయక జ్ఞాన ఉత్పత్తికి ఇది ఆటంకమని తాము భావిస్తున్నట్లు ఈ లేఖలో వారు పేర్కొన్నారు.
NCERT ఏకపక్ష ప్రయత్నాలపై బహిరంగ చర్చకు మద్దతు దేశవ్యాప్తంగా ఉన్న సబ్జెక్టు నిపుణుల సహకారంతో రూపొందించిన పాఠ్యపుస్తకాలను సవరించడానికి ఎన్సీఈఆర్టీ చేస్తున్న ఏకపక్ష ప్రయత్నాలపై బహిరంగ చర్చకు తాము మద్దతు తెలుపుతున్నట్లు 33 మంది నిపుణులు వెల్లడించారు. రాజకీయ శాస్త్ర పాఠ్యపుస్తకాలను రూపొందించే ప్రయత్నాలలో పాల్గొన్న తాము…వాటి ద్వారా విద్యార్థులకు స్వాతంత్య్ర పోరాట ఆదర్శాలు, రాజ్యాంగ సభ ఆకాంక్షలు, రాజ్యాంగ సూత్రాలు, నాయకులు, ఉద్యమాల పాత్ర, సమాఖ్య వ్యవస్థ స్వభావం వంటివి వివరించాలని భావించామన్నారు. తాజా పరిణామాలపై, పుస్తకాల్లో మార్పులపై చింతిస్తూ ఎన్సీఈఆర్టీ రాజకీయ శాస్త్ర పాఠ్యపుస్తకాల నుంచి పాఠ్యపుస్తక అభివృద్ధి కమిటీ సభ్యులుగా తమ పేర్లను తొలగించాలని కోరామని చెప్పారు. ఇప్పటికే ఎన్సీఈఆర్టీకి సిలబస్ సలహాదారులుగా ఉన్న యోగేంద్ర యాదవ్, సుహాస్ పల్సికర్ కూడా పాఠ్యపుస్తకాల నుంచి తమ పేర్లను తొలగించాలని కోరారు.