Rail Jobs 2022: ‘రైల్వేలో ఉద్యోగ ఖాళీల’పై ‘కేంద్రం’ కీలక ప్రకటన..!
- By HashtagU Desk Published Date - 09:56 AM, Thu - 17 March 22

రైల్వే శాఖలో భారీగా ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు కేంద్రప్రభుత్వం తెలిపింది. మొత్తం 2,98,428 ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. వీటిలో ప్రస్తుతం 1,40,713 ఖాళీల భర్తీ అనేది వివిధ దశల్లో ఉందని ఆయన పేర్కొన్నారు. ఖాళీల భర్తీని వేగవంతం చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు అశ్వినీ వైష్ణవ్. బుధవారం లోక్‌సభలో రైల్వే పద్దులపై చర్చ సందర్భంగా మాట్లాడిన అశ్వినీ వైష్ణవ్… రైల్వే శాఖలో ఉద్యోగాల నియామకాలపై నిషేధం లేదని… ఖాళీల భర్తీ అనేది నిరంతర ప్రక్రియ అన్నారు.
కాబట్టి ఖాళీల భర్తీకి ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం లేదని చెప్పారాయన. అలాగే రైల్వేను ప్రైవేటీకరణ చేసే ఆలోచన లేదు… ఈ విషయంలో ప్రతిపక్షాలు ఏదో ఊహించుకుంటున్నాయి’ అని పేర్కొన్నారు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్. మరోవైపు రాజధాని రైళ్లను గంటకు 200 కిలోమీటర్ల వేగంతో నడుపాలన్న ఆలోచనగానీ… ప్రతిపాదనలు గానీ ప్రస్తుతానికి లేవని పునరుద్ఘాటించారు అశ్వినీ వైష్ణవ్.