BRS: కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్ చార్జ్‌షీట్.. కేటీఆర్ డుమ్మా..
BRS: 'ఎడతెగని వంచన' అంటూ బీఆర్‌ఎస్ చార్జ్ షీట్‌ను ఆదివారం విడుదల చేసింది. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు ఈ చార్జ్ షీట్‌ను ఆవిష్కరించారు.
- By Kavya Krishna Published Date - 02:06 PM, Sun - 8 December 24
BRS: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేస్తూ, ‘ఎడతెగని వంచన’ అంటూ చార్జ్ షీట్‌ను ఆదివారం విడుదల చేసింది. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు ఈ చార్జ్ షీట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన రాష్ట్ర ప్రజలకు కష్టాలు, వేదనలు మిగిల్చిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ధ్వంసం చేసిందని, మూసీ, హైడ్రా ప్రాజెక్టుల పేరుతో అనవసరంగా నగరానికి చెడుగొట్టారని హరీష్ ఆరోపించారు. ఖమ్మం వరదలు వచ్చినప్పుడు తక్షణ సహాయం అందించడంలో విఫలమైన కాంగ్రెస్ మంత్రులను ‘చేతకాని దద్దమ్మలు’గా అభివర్ణించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని, చట్టపరమైన నిర్ణయాలు గాంధీ భవన్ నుంచి వస్తున్నాయని హరీష్ మండిపడ్డారు.
రైతు సంక్షేమంపై తీవ్ర విమర్శలు
రైతుల రుణమాఫీ ప్రకటనలు, రైతు బంధు వంటి పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు అభివృద్ధి చెందగా, రేవంత్ రెడ్డి పాలనలో అవి పూర్తిగా విస్మరణకు గురయ్యాయని హరీష్ వ్యాఖ్యానించారు. ‘ఇరిగేషన్ పెరిగిన చోట ఇరిటేషన్ పెరిగింది,’ అని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Weekly Horoscope : డిసెంబరు 9 నుంచి 15 వరకు వారఫలాలు.. మంగళ, బుధవారాల్లో ఆ రాశుల వారికి అలర్ట్
ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి కేటీఆర్ గైర్హాజరు
బీఆర్ఎస్ చార్జ్ షీట్ విడుదల కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గైర్హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. హరీష్ రావు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ హాజరు కాకపోవడం పలు ప్రశ్నలు రేకెత్తించింది. కేటీఆర్ ఎందుకు గైర్హాజరయ్యారు అనేది ఇంకా స్పష్టత లేని అంశమని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వచ్చిన ఈ చార్జ్ షీట్ అధికార దుర్వినియోగం, సంక్షేమ పథకాల అమల్లో గందరగోళంపై కేంద్రీకృతమైంది. భవిష్యత్ రాజకీయ సమీకరణాల్లో ఈ చార్జ్ షీట్ కీలకపాత్ర పోషించే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.